
రోడ్డుకు అడ్డంగా గ్రానైట్ లారీ
మెళియాపుట్టి: మండలంలోని చింతలపోలూరు వద్ద గ్రానైట్ రాయితో వెళుతున్న లారీ సాంకేతిక కారణంగా రహదారికి అడ్డంగా నిలిచిపోయింది. సాయంత్రం సమయం కావడం, అధిక సంఖ్యలో రాకపోకలు కొనసాగించే రహదారి కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీనబంధుపురం గ్రామ పంచాయతీలో సుమారు 20కి పైగా గ్రానైట్ క్వారీలు ఉండటంతో రాకపోకలు సాగించే వాహనాల శబ్దాలతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
గంజాయి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష
మెళియాపుట్టి : మెళియాపుట్టి కూడలిలో 2023 ఏప్రిల్ 25న గంజాయితో పట్టుబడిన బులుమాలి అనే వ్యక్తికి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ మంగళవారం కోర్టు తీర్పు వెలువరిచింది. నిందితుడిది ఒడిశా రాష్ట్రం చడియాపడ గ్రామమని పోలీసులు తెలిపారు.
న్యాయమూర్తులకు బదిలీలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పలువురు న్యాయమూర్తులకు బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. శ్రీకాకుళం ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి భరణికి నర్సీపట్నం ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ కోర్టుకు బదిలీ అయ్యింది. ఆమదాలవలస జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎస్.మణికి కాకినాడ, నరసన్నపేట కోర్టు న్యాయమూర్తికి పాలకొండకు బదిలీ అయ్యింది. పాలకోండ కోర్టు న్యాయమూర్తి విజయ్‌రాజ్‌కి విజయనగరం జూనియర్ డివిజన్ సివిల్ కోర్టుకు, సోంపేట కోర్టు న్యాయమూర్తి ఎ.రాముకు విశాఖపట్నం బదిలీ చేశారు. టెక్కలి కోర్టు న్యాయమూర్తి హెచ్‌ఆర్ తేజా చక్రవర్తికి విజయనగరం బదిలీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి కె.శ్రీనివాస్ సోంపేట కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట నుంచి ఎస్.వాణి నరసన్నపేట కోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.
27న జిల్లా బీచ్ కబడ్డీ జట్లు ఎంపిక
శ్రీకాకుళం అర్బన్: జిల్లా సీనియర్స్ పురుషులు, మహిళల బీచ్ కబడ్డీ జట్ల ఎంపికలు ఈ నెల 27న నిర్వహిస్తున్నట్టు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు నక్క కృష్ణారావు, కార్యదర్శి సాదు ముసలినాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌కాలనీ స్విమ్మింగ్ ఫూల్, ఇండోర్ స్టేడియం వద్ద నాగావళి రివర్ నదీతీరాన ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఈ ఎంపికలు జరుగుతాయని చెప్పారు. పురుషులు 85 కేజీలు, మహిళలు 75 కేజీల లోపు బరువు ఉండాలని స్పష్టం చేశారు. ఇక్కడ ఎంపికై న జట్లు మే 2 నుంచి 4వ తేదీ వరకు కాకినాడలో జరగనున్న ఏపీ రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలలో శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి, పీడీ సాధు శ్రీనివాసరావు (సెల్: 9441914214)ను సంప్రదించాలని వారు కోరారు.
రోడ్డు ప్రమాదంలో
ముగ్గురికి గాయాలు
రణస్థలం: మండల కేంద్రం రణస్థలంలోని జాతీయ రహదారిపై పాత పెట్రోల్ బంకు కూడలి వద్ద ద్విచక్ర వాహనాన్ని మంగళవారం ఉదయం 10.30 టాటా లగేజీ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందులో బి.సీతారాం అనే వ్యక్తికి రెండు కాళ్లు విరిగిపోయి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పల్ల శివాజి, రేగాన వెంకటేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. జె.ఆర్.పురం ఏఎస్సై డి.రమణమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. క్షతగాత్రులు లావేరు మండలం పైడియ్యవలసకు చెందినవారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
ఎస్పీలతో డీఐజీ సమీక్ష
శ్రీకాకుళం క్రైమ్ : విశాఖ రేంజి పరిధిలోని ఎస్పీలు, ఇతర అధికారులతో డీఐజీ గోపినాథ్ జెట్టి మంగళవారం సమీక్ష నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగ నియంత్రణ, నిందితుల అరెస్టు, వారి ఆస్తుల జప్తు తదితర అంశాలపై చర్చించాచారు. చెక్‌పోస్టుల వద్ద నిఘా, విస్తృత తనిఖీలు నిర్వహించాలని, తప్పించుకుని తిరుగుతున్న నిందితులను అరెస్టు చేసి వారిపై ఉన్న నాన్‌బెయిల్‌బుల్ వారెంట్లు తక్షణమే జారీ చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డుకు అడ్డంగా గ్రానైట్ లారీ