పురాతన జైన విగ్రహం అదృశ్యం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా కెచ్చల ప్రాంతంలో కొండ మీద ఉండే 7 పురాతన జైన విగ్రహాల్లో ఒకటి అదృశ్యమైంది. ఇది గమనించిన గిరిజనులు కొరాపుట్ సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. 6 శతాబ్దంలో కొరాపుట్ జిల్లాలో నందపూర్ నుంచి బి.సింగ్‌పూర్ వరకు జైన సంస్కృతి కొనసాగిందని చరిత్ర చెబుతోంది. కెచ్చల ప్రాంతంలో విగ్రహాలు కొలాడ్ రిజర్వాయర్ ప్రారంభమైనప్పుడు నీటిలో మునిగిపోయాయి. అనంతరం గిరిజనులు వాటిని తీసుకువచ్చి పూజిస్తున్నారు. అందులో పెద్ద విగ్రహం ఇప్పుడు అదృశ్యమైంది.
సమాధి పూడ్చివేత
కొరాపుట్: మత వివాదంగా మారిన సమాధి సమస్య పరిష్కారమైంది. శుక్రవారం రెండు మతాల వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. నబరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితి కుమిలి గ్రామ పంచాయతీ మాల్బెడ గ్రామంలో మతం మార్చుకున్నందుకు అంత్య క్రియల విషయంలో వివాదం రేగిన విషయం పాఠకులకు విధితమే. సొంత పొలంలో పూడ్చిన మృతదేహాన్ని బయటకు తీసేందుకు కూడా ప్రయత్నించారు. తాజాగా ప్రస్తుత ఒప్పంద ప్రకారం తిరిగి హిందూ మతానికి రావడానికి బాధిత కుటుంబం అంగీకరించింది. దాంతో ఇరు వర్గాలు రాజీ పడ్డాయి. సగం మట్టి తీసిన సమాధిని తిరిగి మట్టి పోసి కప్పారు.


