చెరువు కాటేసింది..
జయపురం: చెరువులో మునిగి ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి బలిగాం పంచాయతీ బానుగుడ గ్రామంలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బానుగుడ గ్రామానికి చెందిన పదలాం దొరాపుటియ కుమార్తె ప్రమీళ దొరాపుటియ (10), అదే గ్రామం పరుశురాం పలిగుడియ కుమార్తె అమ్రిత పలిగుడియ(8)లు స్కూల్‌కు వెళ్లి మధ్యాహ్నం ఇళ్లకు తిరిగి వచ్చారు. పుస్తకాలను ఇంటి దగ్గర పెట్టేసి తండ్రులతో కలసి బానుగుడ గ్రామంలోని చెరువులో స్నానం కోసం వెళ్లారు. వారి తండ్రులు స్నానం చేసి ఏదో పనిపై వెళ్లిపోయారు. వారు వెళ్లిన తరువాత కూడా మరికొంతమంది బాలికలతో కలిసి దొరాపుటియ, పలిగుడియలు స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పోయారు. ఎంత సేపటికీ వారు బయటకు రాకపోవడంతో మిగతా పిల్లలు ఆందోళనతో వచ్చి గ్రామస్తులకు విషయాన్ని తెలియజేశారు. వెంటనే గ్రామస్తులు వచ్చి చెరువులో గాలించి ఇద్దను బాలికలను బయటకు తీసి.. బలిగాం ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పిల్లలిద్దరూ అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకుంది. రామగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన తరువాత కుటుంబ సభ్యలకు అప్పగించారు.
నీట మునిగి ఇద్దరు బాలికలు మృతి
చెరువు కాటేసింది..


