కొలువుదీరిన ఘటాలు
రాయగడ: పట్టణంలో మజ్జిగౌరి అమ్మవారి చైత్రోత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారి ప్రతిరూపాలుగా కొలిచే ఘటాలు కొలువుదీరాయి. ఆలయ ప్రాంగణంలో ఘటాలను ఏర్పాటు చేశారు. పసుపు, కుంకుమలను అద్దిన ఘటాలను ప్రత్యేకంగా పూజించారు. సాయంత్రం నుంచి ఘటాల నగర పరిక్రమణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో దుష్టశక్తులు ప్రవేశించకుండా వాటి బారినుంచి ప్రజలను కాపాడాలన్న ఉద్ధేశంతో అమ్మవారు ప్రతిరోజూ రాత్రి నగర పరిక్రమణ చేస్తారని ప్రతీతి. చరిత్రకు అనుగుణంగా సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారి ప్రతిరూపాలైన ఘటాలను ఈ చైత్రోత్సవాల ఐదు రోజులూ ఊరేగిస్తారు. దీనినే నగర పరిక్రమణ అంటారు. ఘటాలు ఊరేగించే సమయంలో పూజారి ఘటాల ముందు పసుపు కలిపిన బియ్యాన్ని గ్రామస్తులకు బొట్టుగా అందిస్తారు. ఈ బొట్టును ధరిస్తే దుష్టశక్తులు ఏవీ దరి చేరవని నమ్మకం. అదేవిధంగా చిన్న పిల్లలకు ఈ పసుపును నీటిలో కలిపి తాగిస్తారు. దీంతో ఏటువంటి రోగాలు దరి చేరవని నమ్మకం.
చండీ హోమం
పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, పంటలు సమృద్ధిగా పండాలని ప్రతీ ఏడాది చైత్రోత్సవాల ప్రధాన పూజల్లో భాగంగా చండీహోమం నిర్వహిస్తారు. గంజాం జిల్లా కవిసూర్యనగర్‌కు చెందిన ప్రత్యేక పురోహితుల ఆధ్వర్యంలో చండీహోమం పూజలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. చివరి రోజున ఈ చండీహోమం ముగిస్తారు. దీనినే పూర్ణాహుతి అంటారు.
ప్రత్యేక అలంకరణ
సునాబేసోలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారి గర్భగుడితో పాటు ఆలయ ప్రాంగణాన్ని కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతిరోజూ ప్రసాద సేవన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. వివిధ సేవా సంస్థలకు చెందిన మహిళలు ప్రసాదాలను వితరణ చేస్తున్నారు.
ప్రారంభమైన నగర పరిక్రమణ
కొనసాగుతున్న చైత్రోత్సవాలు


