● పిల్లల బరువులో బ్యాగు బరువు 10 శాతానికి మించరాదంటున్న వైద్య నిపుణులు | - | Sakshi
Sakshi News home page

● పిల్లల బరువులో బ్యాగు బరువు 10 శాతానికి మించరాదంటున్న వైద్య నిపుణులు

Jun 27 2026 1:31 AM | Updated on Jun 27 2026 1:31 AM

● పిల్లల బరువులో బ్యాగు బరువు 10 శాతానికి మించరాదంటున్న వైద్య నిపుణులు ● బుడిబుడి అడుగుల వయసులోనే వీపున బండెడు పుస్తకాల భారం మోస్తున్న బుడతలు ● స్కూల్‌ బ్యాగుల బరువుతో పిల్లల వెన్నెముకపై ఒత్తిడి ● అంతకు మించితే సమస్యలు తప్పవని హెచ్చరిక

● బుడిబుడి అడుగుల వయసులోనే వీపున బండెడు పుస్తకాల భారం మోస్తున్న బుడతలు

లబ్బీపేట(విజయవాడ తూర్పు): విజయవాడ సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన సిద్దు ఐదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల తరచూ వెన్నునొప్పి అని చెప్పి స్కూల్‌కు డుమ్మా కొడుతున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో పిల్లవాడు బడి ఎగ్గొట్టి ఇంటి వద్ద ఆడుకోవటానికి వంక చెబుతున్నాడని భావించారు. రోజూ ఇదే సమస్య చెబుతుండటంతో ఇటీవల వైద్యుడ్ని సంప్రదించారు. పరీక్షించిన అనంతరం వెన్నెముకకు ఇబ్బంది ఏర్పడటమే నొప్పికి కారణమని నిర్ధారించారు. స్కూల్‌లో, ఇంట్లో ఏసీ గదుల్లోనే ఎక్కువ సమయం గడుపుతూ శరీరానికి ఎండ తగలక విటమిన్‌ డి లోపం ఏర్పడి ఇలాంటి సమస్యలు వస్తున్నట్టు తేల్చారు. సిద్దులాగే విద్యార్థులు తన శరీర బరువు కంటే అధిక మొత్తంలో బ్యాగ్‌ బరువు మోస్తూ ఉండటం.. వెన్నెముకపై అధికభారం పడటం వల్ల పిల్లల్లో ఈ సమస్యలు వస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

గదుల్లోనే మగ్గుతున్న బాల్యం..

ఆడుతూ పాడుతూ సరదాగా సాగాల్సిన బాల్యం పోటీ ప్రపంచంలో పుస్తకాల మోత బరువుతో పాఠశాల గదుల్లోనే మగ్గిపోతోంది. పలక బలపం పట్టుకుని బడికెళ్లే బాల్యం నేడు మచ్చుకై నా కనిపించటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోనూ కాన్వెంట్‌ స్కూల్స్‌పై మోజు పెరిగిపోయి బుడిబుడి అడుగులు వేసే బుడతలకు బండెడు పుస్తకాలు మూటగట్టి వీపున వేస్తున్నారు. నర్సరీ ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారులకే డ్రాయింగ్‌ బుక్స్‌, హోంవర్క్‌ పుస్తకాలు, ఇతర పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు 20 నుంచి 30 వరకు పుస్తకాలు ఇస్తున్నారు. ఫలితంగా చిన్న వయస్సులోనే పిల్లలు వెన్ను సమస్యల బారిన పడుతున్నారు. లేత వెన్నుపై అధిక భారం మోపటం వల్ల భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పిల్లల్లో వచ్చే సమస్యలు ఇవే..

స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఎక్కువ సేపు స్కూల్స్‌ బ్యాగ్స్‌ మోయటం, ఎక్కువ సేపు ఒకే భంగిమలో స్కూల్స్‌లో, ట్యూషన్‌ సెంటర్స్‌లో కూర్చోవటం వల్ల నడుము నొప్పి వస్తుంది. కొంత మంది పిల్లల్లో పుట్టుకతోనే ఎముకలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవటం వల్ల స్పయిన్‌ ఫ్యూజన్‌ వంటి సమస్యలొస్తాయి. స్కోలియోసిస్‌ వచ్చిన వారిలో వెన్నుముక సీ లేదా ఎస్‌ ఆకారంలో ఒకవైపు వంగి ఉంటుంది. ఫలితంగా భుజాలు లేదా నడుం భాగం అసమానంగా ఉంటుంది. కై ఫోసిస్‌ వల్ల పిల్లలు ముందుకు గుండ్రంగా వంగి కూర్చునట్లు కనిపిస్తారు.

వెన్నునొప్పి లక్షణాలు..

నడకలో తేడా కనిపిస్తుంది. నిలబడటంలో కూడా ఇబ్బందిగా ఉంటుంది. త్వరగా పిల్లలు అలసిపోతారు. నడుము లేదా మెడనొప్పి ఉంటుంది. వెన్నెముక భాగం వంకరగా కనిపిస్తుంది. వెనుక భాగంలో అసౌకర్యంగా ఉంటుంది. కొద్దిపాటి లేదా విపరీతమైన నొప్పి వెన్ను భాగంలో వస్తుంది. రాత్రి వేళల్లో నొప్పి వల్ల పిల్లలు సరిగా నిద్రపోరు. జ్వరంగా ఉంటుంది. ఆటలు ఆడేందుకు సైతం ఇబ్బంది పడతారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement