ప్రశ్నిస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారం ఎమ్మెల్యే ప్రసాద్ తీరుపై దేవభక్తుని చక్రవర్తి మండిపాటు
పెనమలూరు: స్వార్థ రాజకీయాలు, అక్రమార్జన కోసం ఎమ్మెల్యే బోడెప్రసాద్ వికృత చేష్టలకు పాల్పడుతున్నాడని, వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి విమర్శించారు. దీనికోసం కార్యకర్తలను బలి చేస్తున్నాడని, తాను దీనిని సమర్థవంతంగా అడ్డుకుంటానని చెప్పారు. కానూరులో పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ప్రసాద్ అక్రమార్జన కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే మాయలో పడి కేసులు పెట్టించుకోవద్దని హితవు చెప్పారు. తాము టీడీపీ కార్యకర్తలతో గొడవలు పడటానికి ఇష్టపడనన్నారు. అయితే ఎమ్మెల్యే మాటలు విని ఎవరైన దాడులకు దిగితే ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు.
అభివృద్ధి పనుల్లో భారీ అవినీతి..
ఎమ్మెల్యే అవినీతి అక్రమాలను తాను అడ్డుకుంటున్నాననే అక్కసుతో అమాయక కార్యకర్తలతో కలిసి దాడులకు దిగుతున్నాడని చక్రవర్తి విమర్శించారు. అవినీతి, దందాలపై తాము ప్రశ్నిస్తే ఎమ్మెల్యే నుంచి జవాబులేదన్నారు. కానూరులో జరిగిన అభివృద్ధి పనుల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. టెండర్లు, టెక్నికల్ సాంక్షన్, పరిపాలన మంజూరు లేకుండానే అక్రమార్జన కోసం పనులు చేశారన్నారు. ఇలా చట్ట విరుద్ధంగా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే తాను అభివృద్ధిని అడ్డుకుంటున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఖండించారు. ఎటువంటి పరిపాలన, సాంకేతిక ఆమోదం లేకుండా అభివృద్ధి పనులు చేయవచ్చని ఇంజినీరింగ్ శాఖ అధికారులతో ప్రకటన చేయిస్తే తాను రాజకీయాలు విరమించుకుంటానని సవాల్ విసిరారు.
పాస్‌పోర్టు ఉంటేనే ప్రయాణం చేయాలా..?
తాను విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి పై ప్రయాణం చేయాలంటే పాస్‌పోర్టుతో ఎమ్మెల్యే ప్రసాద్ అనుమతి తీసుకోవాలా అని చక్రవర్తి ప్రశ్నించారు. పోలీసు వాహనంపై అల్లరి మూకలు దాడులు చేస్తే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కానూరులో టీడీపీ దిమ్మను తాను ధ్వంసం చేయమని చెప్పానని ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. తాడిగడప వద్ద వైఎస్సార్ విగ్రహం ఎలా తొలగించారని ప్రశ్నించారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని సమయం వచ్చినప్పుడు సరైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నేతలు వేమూరి బాలకృష్ణ, ప్రతివాడ రాఘవరావు, సిద్దిక్, మండూరు కోటేశ్వరరావు, నందిపాటి బిందుమాధవి, కాసాని ఫణి, తోకల ఉమాదేవి పలువురు పాల్గొన్నారు.


