గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా భాగస్వామ్యంతో డ్రగ్స్‌ను నిర్మూలిద్దామని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయ వాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి (ఓల్డ్ జీజీహెచ్) వద్ద రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జెండర్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఈగల్ ఏపీ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, వాకథాన్ నిర్వహించారు. దీనిలో పాల్గొన్న వారందరూ ‘డ్రగ్స్ వద్దు బ్రో’ నినాదాలు చేశారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా పని చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జెండర్, వయో వృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్ ఫ్రీ ఏపీ లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈగల్ ఏపీ ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 40 వేలకుపైగా ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ యూనిట్ చైర్మన్ సమరం, జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్ సీ సీ అధికారులు, విద్యార్థులు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ


