సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం

Jun 26 2026 7:45 AM | Updated on Jun 26 2026 7:45 AM

సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం పంట మార్పిడిపై ప్రత్యేక అవగాహన శిబిరాలు సత్యదేవుని నిత్యాన్నదానానికి విరాళం రేపు ఎంఎస్‌ఎంఈ మహోత్సవ్‌

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో భాగంగా పాలిసెట్‌–2026 ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన వారి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ గురువారం నుంచి మొదలైంది. పాలిసెట్‌ రాసిన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే పరిశీలించి ధ్రువీకరిస్తామని పాలిసెట్‌–2026 ఎన్టీఆర్‌ జిల్లా కన్వీనర్‌ ఎం.విజయసారధి చెప్పారు. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించిన వెంటనే ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయినట్లుగా మెసేజ్‌ వస్తుందని, ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తి కాని వారు మాత్రం హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు స్వయంగా సర్టిఫికెట్లతో వచ్చి ధ్రువీకరించుకోవాలని చెప్పారు. హెల్ప్‌లైన్‌ సెంటర్‌ వెరిఫికేషన్‌ ఆఫీసర్‌ జీవీ ఈశ్వర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): వ్యవసాయం, దాని అనుబంధ రంగాల రైతులకు సుస్థిర ఆదాయం లభించేలా ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఉద్యానపంటలు దిశగా వెళ్లడంతో పాటు పంటల మార్పిడిపై మండలాల వారీగా ప్రత్యేక అవగాహన శిబిరాలు నిర్వహించనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని), ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ, తెలిపారు. గురువారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఎంపీ కేశినేని శివనాథ్‌ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయం, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జల్‌ జీవన్‌ మిషన్‌, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, పీఎం–కిసాన్‌, ప్రధానమంత్రి మాతృవందన యోజన, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ్‌ కౌశల్య యోజన తదితర కేంద్ర, రాష్ట్ర అనుసంధాన పథకాల అమలు తీరుపై సమీక్షించి, భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలామృతం ప్లస్‌ పోస్టర్లను ఆవిష్కరించి.. బాలామృతం కిట్లను అందజేశారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌, జెడ్పీ సీఈఓ జె. అరుణ, టాటా ట్రస్టుల జిల్లా ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.

అన్నవరం: సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి విజయవాడకు చెందిన అంబటి జయవేంకట చలపతి, వెంకటలక్ష్మి దంపతులు రూ.5 లక్షల విరాళాన్ని గురువారం సమర్పించారు. ఈ మేరకు చెక్కును ఈవో నల్లం సూర్యచక్రధరరావుకు అందజేశారు. ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దాతల పేరు మీద అన్నదానం చేయాలని ఆమె కోరారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): అంతర్జాతీయ ఎంఎస్‌ఎంఈ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27వ తేదీన ఎనికేపాడులోని ఆర్‌టీఐహెచ్‌లో ఎంఎస్‌ఎంఈ ఉత్సవ్‌–2026ను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. అదే రోజున యువతకు మెగా మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ లక్ష్మీశ గురువారం కలెక్టరేట్‌ శ్రీ ఏవీఎస్‌ రెడ్డి హాల్‌లో ఆర్‌టీఐహెచ్‌–విజయవాడ సీఈవో జి.కృష్ణన్‌, ఏపీ ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ డి.దుర్గా ప్రసాద్‌, జేఆర్‌డీ టాటా ఐలా చైర్మన్‌ టి.వినోద్‌బాబు, ప్రకాస స్పెక్ట్రో కాస్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ టి.పార్థసారథి, జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధుతో కలిసి ఎంఎస్‌ఎంఈ మహోత్సవ్‌ పోస్టర్‌ ఆవిష్కరించారు. కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) రాష్ట్ర, దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమైన శక్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement