మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్
కృష్ణలంక(విజయవాడ తూర్పు): కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల తాళలేక ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ అన్నారు. గురువారం వారు పేరుపోగు క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరావును పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఐ నాగరాజు అరాచకాలకు క్రాంతికుమార్ బలవడం బాధాకరమన్నారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే అన్నారు. సీఐ నాగరాజుతో పాటు ఇందులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదు చేయాలన్నారు. టీడీపీ ప్రభుత్వ గెలుపు కోసం పని చేసిన పేరుపోగు వెంకటేశ్వరరావు కుటుంబం పట్ల మరణించిన క్రాంతి కుమార్ ఆత్మహత్య విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. గాదె సాయికృష్ణ కేసు విషయంలో సీఎం చంద్రబాబు ఏ విధంగా అయితే న్యాయం చేశారో అలాగే క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించి సామాజిక న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఘటన జరిగి 30 రోజులు దాటినా ఈ కేసులో పురోగతి లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు.


