మరణ వాంగ్మూలం ఇచ్చినా...
సీఎం చంద్రబాబు స్పందించాలి
పలువురి పరామర్శ
దళితులంటే చిన్నచూపేల
లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కేసును ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వారం రోజులుగా వివిధ సంఘాలు, పార్టీలు వారి కుటుంబాన్ని పరామర్శిస్తూ, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. దళితులంటే ప్రభుత్వానికి లెక్కలేనితనంగా ఉందంటూ దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 26న కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు దళిత సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు నిర్ణయం తీసుకోనున్నారు.
క్రాంతికుమార్ ఆత్మహత్యకు పాల్పడే ముందు సెల్ఫీ వీడియో చిత్రీకరించాడు. దానిలో కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేకున్నానని, అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొనడమే కాకుండా, మాదిగగా పుట్టడమే నా తప్పంటూ మాట్లాడిన వైనంపై దళిత సంఘాల నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. క్రాంతికుమార్ స్వయంగా మరణవాంగ్మూలం ఇచ్చినా ప్రభుత్వం స్పందించక పోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎమ్మార్పీఎస్, కేవీపీఎస్‌తో పాటు, దళిత ఉద్యోగుల సంఘం, వైఎస్సార్ సీపీ, సీపీఎం నాయకులు క్రాంతికుమార్ కుటుంబసభ్యులను పరామర్శించి వారికి తమ మద్దతు ప్రకటించారు.
క్రాంతికుమార్ మరణంపై చంద్రబాబు స్పందించాలని మృతుని తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావుతో పాటు, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్ర మాల్యాద్రి, ఎమ్మార్పీఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి క్రాంతికుమార్ కుటుంబానికి సాయం అందించాలని, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వమే చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒక సీఐ కారణంగా దళితుడు మరణిస్తే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని, హోం మంత్రి దళితురాలై ఉండి కూడా ఇప్పటివరకూ నోరు విప్పకపోవడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. అనేక సామాజిక సమస్యలపై పోరాటం చేసిన నాయకుడికే న్యాయం జరగకుంటే, ఇంకెవరికి చేస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్ కేసుతో ప్రభుత్వానికి తలబొప్పి కట్టడంతో గత్యంతరం లేని పరిస్థితిలో సీఐ నాగరాజును అరెస్టు చేసి చేతులు దులిపేసుకుంది. అయితే ఇదే సీఐ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో తీసి మరీ ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు క్రాంతికుమార్ కేసును మాత్రం పట్టించుకోవడం లేదు. దళితులంటే కూటమి ప్రభుత్వానికి మొదటి నుంచీ చిన్నచూపేనని, అందుకే క్రాంతికుమార్ కేసును పట్టించుకోవటం లేదని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దళిత యువకుడు క్రాంతికుమార్
ఆత్మహత్యపై పట్టించుకోని ప్రభుత్వం
సీఐ నాగరాజు వేధింపులతో
ఆత్మహత్యకు పాల్పడుతూ సెల్ఫీ వీడియో
ఆ సెల్ఫీ వీడియోను మరణ
వాగ్మూలంగా పరిగణించరా?
ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న
దళిత సంఘాలు
కార్యాచరణ నిమిత్తం
ఈ నెల 26 సమావేశం
సీబీఐ విచారణతో పాటు, ఎస్సీ, ఎస్టీ
అట్రాసిటీ యాక్ట్‌లో కేసు కట్టాలని
డిమాండ్
మృతుని కుటుంబానికి పరిహారం,
భార్యకు ఉద్యోగం ఇవ్వాలంటున్న
దళిత సంఘాలు


