గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఏపీ ఎన్జీవోతోనే సాధ్యమని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.సత్యనారాయణరెడ్డి, పి.రమేష్ అన్నారు. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకోవడంలో నిరంతరం కృషి చేసిన ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ను జిల్లా, నగర కార్యవర్గ సభ్యులు బుధవారం ఎన్జీవో హోమ్‌లో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు మేలు జరిగేలా ఉద్యోగ విరమణ వయసు పెంపు, పాత పెన్షన్ విధానం అమలుపై రాష్ట్ర కేబినెట్ మెమో–57 అమలు ద్వారా సుమారు 11 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు జీవితాంతం భరోసా లభిస్తుందన్నారు. ఈ మెమో రావడం వెనుక విద్యాసాగర్ కృషి ఎంతో ఉందన్నారు. మెమో–57 సమస్య అనేక సంవత్సరాలుగా వేలాది మంది ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్న అంశమని, ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు. రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం లభించడం ఆయన పట్టుదల, దూరదృష్టి, అంకితభావానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వేమూరి ప్రసాద్, బి. సతీష్ కుమార్, బీవీ రమణ, రామకృష్ణ, నగర కార్యవర్గ సభ్యులు బి.రాజశేఖర్, ఎస్‌కే నజీరుద్దీన్, శివశంకర్, కాశీం సాహెబ్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు
డి.సత్యనారాయణ రెడ్డి, పి.రమేష్


