పెనమలూరు: యనమలకుదురులోని శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవస్థానం హుండీ కానుకలను బుధవారం ఆలయ ప్రాంగణంలో అధికారుల సమక్షంలో లెక్కించారు. 125 రోజుల వ్యవధిలో భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలు రూ 14,20,491 ఆదాయం వచ్చింది. బంగారం 6 గ్రాముల 330 మిల్లీ గ్రాములు, వెండి 910 గ్రాములు, యూఎస్ డాలర్లు 30, సౌత్ ఆఫ్రికన్ 100 ర్యాండ్ ఒక నోటు, థాయ్‌ల్యాండ్ 20 డాట్ రెండు నోట్లు, యూకే 5 పౌండ్ ఒక నోటు హుండీలో భక్తులు వేశారు. జిల్లా దేవాదాయ సహాయ కమిషనర్ లలిత, యనమలకుదురు కనకదుర్గ అమ్మవారి ఆలయ ఈవో యు.వీ.ప్రసాదరావు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి దాత సంగా నరసింహారావు, ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం, సేవా సభ్యులు, పలువురు పాల్గొన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు విజయవాడలో ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ‘జాబ్ మేళా’ జరుగుతుందన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్ల లోపు యువతీ, యువకులు జాబ్ మేళాకు అర్హులని పేర్కొన్నారు. మేళాలో ఎంపిక అయిన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ. 50వేల వరకు వేతనం, ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వివరించారు. మరిన్ని వివరాలకు 9032633548, 9985759304 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన ఎనిమిది మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. విజయవాడ నగరంలోని పలు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఈ నెల 10 నుంచి 23 వరకూ నిర్వహించిన తనిఖీల్లో 101 మంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసి న్యాయస్థానాల్లో ప్రవేశ పెట్టగా, వారిలో ఒకరి మూడు రోజులు, మరో ఏడుగురికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించిన ప్రభుత్వం, మరో 93 మందికి రూ.9.95 లక్షల జరిమానా విధించింది.
5 కేజీల గంజాయి స్వాధీనం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం అరెస్ట్ చేసింది. వారి నుంచి 5 కేజీల గంజాయి, బైక్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా మధ్య నిషేధ, అబ్కారీ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ లావణ్య ఆదేశాలు మేరకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం బుధవారం సితార సెంటర్‌లో తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు యమహా ఎంటీ–15 బైక్‌పై గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. వారిని తనిఖీ చేయగా మూడు ప్యాకెట్లలో మొత్తం 5 కేజీల గంజాయి పట్టుబడింది. ఆ ఇద్దరు జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన కుంచాల సూర్య తేజ, ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన కలపాల తేజలుగా గుర్తించారు. వీరికి ఆంధ్ర–ఒడిస్సా సరిహద్దుకు చెందిన కార్తీ గంజాయి సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఇరువురిని భవానీపురం ఎకై ్సజ్ స్టేషన్‌లో అప్పగించారు. గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు సరఫరా చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. సూర్యతేజ, కలపాల తేజలను అరెస్ట్ చేసి వారి వద్ద 5 కేజీల గంజాయి, బైక్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని కోర్టు ముందు హాజరు పరచగా రిమాండ్ విఽధించినట్లు ఎకై ్సజ్ సీఐ టి.గోపాలకృష్ణ తెలిపారు.


