● సమాజంలో మార్పు తెచ్చేందుకే విద్యాశాఖను ఎంచుకున్నా ● విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
కొక్కిలిగడ్డ(మోపిదేవి): సజాజంలో మార్పు తెచ్చేందుకే తాను విద్యాశాఖను ఎంచుకున్నానని రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చి దేశంలోనే ఆదర్శవంతంగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకురాలన్నది తన ధ్యేయమన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అధికారుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమవుతుందన్నారు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని కొక్కిలిగడ్డ గ్రామంలో దాతల సహకారం రూ. 1.40 కోట్లతో నిర్మించిన పాఠశాల తన భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లలో విద్యావ్యవస్థలో సంస్కరణలన్నీ పూర్తి చేశామని, ఇక ఉపాధ్యాయులంతా పూర్తిగా ఫలితాలపైనే శ్రద్ద వహించాలని సూచించారు. ఈ పాఠశాలలో లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ తప్ప అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. వెనకబడిన విద్యార్థుల పనితీరుని మెరుగుపర్చేందుకు బ్రిడ్జి కోర్సు మెటీరియల్ అందచేస్తామని, నూరు శాతం ఫలితాలే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప నిచేయాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థుల చిత్రాలతో పత్రికల్లో యాడ్స్ ఇచ్చామని తెలిపారు. త్వరలో క్లిక్కర్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి తెస్తున్నామన్నారు. లీప్ యాప్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకుని, తమ బిడ్డల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకోవాలని సూచించారు. సర్ ప్రక్రియ కారణంగా ఇంటింటికి ప్రచారం కార్యక్రమం జూలై 10కి వాయిదా వేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. జూలై మూడో వారంలో తల్లికి వందనం రెండో విడత నగదు జమచేయబోతున్నామని తెలిపారు. కృష్ణాజిల్లా ఇన్‌ఛార్జీ మంత్రి వాసంశెట్టి సుభాష్, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు వీరంకి గురుమూర్తి, సీఎంఓ కార్యక్రమాల సమన్వయకర్త, జోనల్ ఇన్‌ఛార్జీ సత్యనారాయణరావు, నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, జడ్పీటీసీ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.


