ఉయ్యూరు: మండలంలోని కాటూరు గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొక్లయినర్ డ్రైవర్ మృతి చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం.. మండలంలోని ముదునూరు గ్రామానికి చెందిన పొక్లయినర్ డ్రైవరు దోమతోటి అర్జునరావు(33) సొంత పనుల నిమిత్తం ఉయ్యూరు వచ్చాడు. బైక్‌పై ఇంటికి వెళ్లే క్రమంలో కాటూరు పెట్రోల్ బంకు సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఉయ్యూరుకు చెందిన డాక్టర్ కడియాల విశ్వేశ్వరరావు కాటూరు నుంచి కారులో ఉయ్యూరు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బైక్ వేగంగా ఢీకొనటంతో అర్జునరావు అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అర్జునరావు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సురేష్‌బాబు తెలిపారు. కాగా డాక్టర్ విశ్వేశ్వరరావు కారు నడుపుతూ ప్రమాదానికి కారణమైనట్లు సమాచారం. మృతుడు అర్జునరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి బంధువుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం మిన్నంటింది. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు దాసే రవి ఘటనాస్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. పేద కుటుంబం కావటంతో అర్జునరావు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


