అసత్య ప్రచారాలు ఇకనైనా ఆపండి | - | Sakshi
Sakshi News home page

అసత్య ప్రచారాలు ఇకనైనా ఆపండి

Jun 18 2026 1:47 AM | Updated on Jun 18 2026 1:47 AM

కేంద్రియ విద్యాలయానికి ఐదెకరాల స్థలం కేటాయించాం ఒక్క సెంటు కేటాయించలేదంటే ప్రజలు నమ్మరు.. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు

చర్చకు సిద్ధం...

నందిగామ టౌన్‌: కేంద్రియ విద్యాలయంపై పాలక పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని మాజీ శాసనసభ్యుడు డాక్టర్‌ మొండితోక జగన్‌మోహనరావు అన్నారు. పట్టణంలోని హనుమంతపాలెం గ్రామ సమీపంలోని టిడ్కో ఇళ్ల వద్ద గత ప్రభుత్వ హయాంలో కేంద్రియ విద్యాలయం శాశ్వత భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రియ విద్యాలయానికి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క సెంటు భూమి కూడా కేటాయించలేదని పాలక పార్టీ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రియ విద్యాలయం, వంద పడకల ఆస్పత్రి మంజూరుపై దగా మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా హనుమంతపాలెంలో ఐదెకరాల స్థలాన్ని కేంద్రియ విద్యాలయం ఏర్పాటుకు కేటాయించినట్లు తెలిపారు. మున్సిపల్‌ శాఖాధికారుల అనుమతితో స్థలాన్ని చదును చేయించి హనుమంతపాలెం, టిడ్కో ఇళ్ల నివాసితులు, విద్యాలయానికి వచ్చే విద్యార్థుల సౌకర్యార్ధం రూ.80 లక్షల వ్యయంతో రోడ్డు కూడా

నిర్మించినట్లు గుర్తు చేశారు. భవన నిర్మాణానికి సాయిల్‌ టెస్ట్‌ సైతం నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. అయితే గత ప్రభుత్వంలో కేటాయించిన స్థలంలో నిర్మించకుండా రాఘవాపురం కొండల్లో కేంద్రియ విద్యాలయ భవన నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్రియ విద్యాలయ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ఆయుష్‌ ఆస్పత్రిని ఎలా నిర్మిస్తారని నిప్పులు చెరిగారు.

కేంద్రియ విద్యాలయం, వంద పడకల ఆస్పత్రిపై చర్చకు సిద్ధమని జగన్‌మోహనరావు అన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో నైనా.. గాంధీ సెంటర్‌లో నైనా మీరు చెప్పిన చోటుకు వస్తామని అన్నారు. ఇప్పటికై నా అసత్య ప్రచారాలు మానుకుని పాలన, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement