వెనుక నుంచి దూసుకొచ్చిన కారు ఢీకొని మహిళ దుర్మరణం మృతురాలి కుమారుడికి తీవ్రగాయాలు రెప్పపాటులో జరిగిన దుర్ఘటనతో నిశ్చేష్టులైన బంధువర్గం
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): ఇంటికొచ్చిన బంధువులను తిరిగి పంపించేందుకు కారుకు ఎదురు వచ్చిన మహిళ ప్రాణాలు వెనుక వైపు నుంచి దూసుకొచ్చిన మరోకారు రూపంలో గాలిలో కలిసిపోయాయి. ఇంటి ముందు కుటుంబ సభ్యుల కళ్లెదుట జరిగిన ఈ దుర్ఘటనలో ఆమె కుమారుడుకి సైతం తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని కిలేశపురంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. సేకరించిన వివరాల మేరకు కిలేశపురం గ్రామానికి చెందిన గుంటుపల్లి రమేష్, గంగాభవాని దంపతుల కుమార్తెకు ఇటీవల వివాహం జరిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి కుమార్తెను పుట్టింటికి కారులో తీసుకొచ్చిన బంధువులను తిరుగు ప్రయాణంలో పంపించేందుకు తన కుమారుడు వెంకట జితేంద్రతో కలిసి శుభశకునం కోసం కారుకు డ్రైవర్ వైపు ఎదురు వచ్చింది. కారు ముందుకు సాగిన మరుక్షణం హైదరాబాద్ వైపు నుంచి దూసుకొచ్చిన మరో కారు వీరిద్దరినీ ఢీకొట్టింది. గంగాభవాని (44) అక్కడికక్కడే మృత్యువాత పడగా, ఆమె కుమారుడు వెంకట జితేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జితేంద్రను హుటాహుటిన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శుభశకునం కోసం ఎదురు వచ్చిన మహిళ ప్రాణాలు కళ్లెదుటే గాలిలో కలసిపోతే ఆ కుటుంబసభ్యులు, బంధువుల వేదన వర్ణనాతీతం. రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటన వారిని నిశ్చేష్టులను చేసింది. తమ ప్రయాణం క్షేమంగా జరగాలని ఎదురువచ్చిన ఆమె మరుక్షణంలో విగతజీవురాలై పడి ఉండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వెనుక నుంచి దూసుకొచ్చిన మరో కారు ఆమె పాలిట యమపాశమైంది.


