దుర్గమ్మ సేవలో జస్టిస్‌ బాలాజీ | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సేవలో జస్టిస్‌ బాలాజీ

Mar 16 2026 8:34 AM | Updated on Mar 16 2026 8:34 AM

దుర్గమ్మ సేవలో జస్టిస్‌ బాలాజీ దుర్గగుడి అభివృద్ధి పనులకు విరాళం విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయండి ప్రశాంతంగా ‘అక్షర ఆంధ్ర’ పరీక్ష

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మెడపల్లి బాలాజీ కుటుంబ సమేతంగా ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అర్చకులు, అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందించారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన అభివృద్ధి పనులకు అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కోమరిగిరిపట్నంకు చెందిన కొప్పాడి రమేష్‌ కుటుంబం రూ. 2.50లక్షల విరాళాన్ని ఆదివారం ఆలయ అధికారులకు అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.

కృష్ణలంక(విజయవాడతూర్పు): వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల్లో దశాబ్ద కాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ఉద్యోగ విరమణ వయస్సును 62 నుంచి 65 ఏళ్లకు పెంచొద్దని నిరుద్యోగ వ్యవసాయ యువ శాస్త్రవేత్తల బృందం డిమాండ్‌ చేసింది. గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్‌ బాలకృష్ణ, డాక్టర్‌ కిరణ్‌ మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లో కొంతమంది ప్రొఫెసర్లు వారి పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచాలని వివిధ సంస్థల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. ఇప్పటికే 60 నుంచి 62ఏళ్లకు పెంచడంతో దశాబ్ద కాలంగా ఎటువంటి నియామకాలు జరగలేదన్నారు. దీంతో వ్యవసాయ, అనుబంధ అత్యున్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు నిరుద్యోగులుగా మారి నిరాశకు లోనవుతున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 65 ఏళ్ల ఉద్యోగ విరమణ అంశమే లేదని, మరి మన రాష్ట్రంలో పెంచడం ఎందుకని ప్రశ్నించారు. సమావేశంలో యువ శాస్త్రవేత్తలు రాజేష్‌, అవినాష్‌ తదితరులు పాల్గొన్నారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): నిరక్షరాస్యు లైన మహిళల్లో అక్షరాస్యత పెంచడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న అక్షర ఆంధ్ర ఫైనల్‌ పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. ఈ పరీక్షకు 97,047మంది అభ్యర్థులు అక్షర ఆంధ్ర యాప్‌లో రిజిస్టర్‌ అయ్యారన్నారని, వారిలో 95,598 మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. ఆదివారం వాంబే కాలనీలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా చదవడం, రాయడం, ప్రాథమిక గణితం మాత్రమే కాకుండా డిజిటల్‌ లావాదేవీలపై కూడా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా జీవన నైపుణ్యాలు పెంపొందడంతో పాటు వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. జిల్లా వయోజన విద్య నోడల్‌ ఆఫీసర్‌ జి. ప్రసాదరావు, యూసీడీ పీవో ఎం.విజయలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement