పెనమలూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యనమలకుదురు పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్.భవానీని సస్పెండ్ చేశారు. సాక్షి దినపత్రికలో ఆలయంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై వచ్చిన వరుస కథనాలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఎండోమెంట్ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. యనమలకుదురు ఆలయంలో హుండీలో సొమ్ము స్వాహా చేసిన ఘటనపై ఎండోమెంట్ జాయింట్‌కమిషనర్ జిల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఘటనపై విచారణ జరిపి ప్రాథమిక నివేదిక అందించారన్నారు. ఆలయంలో హుండీల లెక్కింపులో సరైన చర్యలు తీసుకోలేదని, సీసీ కెమెరాలు ఆపి బయట వ్యక్తులు ప్రవేశించి, హుండీలలో సొమ్ము కాజేశారని, అంతరాలయంలో హుండీ నకిలీ తాళంతో తెరిచి సొమ్ము స్వాహా చేశారని, స్వామివారి ఆభరణాలు, సొమ్ము భద్రపర్చడంలో విఫలమయ్యారని, పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందారన్న అభియోగాలు మోపుతూ ఈవో ఎన్.భవానీని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆమె అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ వీడరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు. కానూరు ఆలయ ఈవో సుబ్రహ్మణ్యంకు శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆచూకీ ఎక్కడ?
ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిన యనమలకుదురు ఆలయం ఈవో భవానీ ఇప్పటికై నా బయటకు వస్తారనా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎండోమెంట్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆమె హెడ్‌క్వార్టర్స్ అనుమతి లేకుండా వీడరాదని పేర్కొన్నారు. వాస్తవానికి ఈవో భవానీ గత వారం రోజులుగా అదృశ్యమయ్యారు. పైగా ఆలయంలో ఎండోమెంట్ జాయింట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ విచారణ చేసిన సమయంలో ఆమె హాజరుకాలేదు. పోలీసులు కూడా భవానీ కోసం గాలిస్తున్నారు.


