నిబంధనలకు టెండర్!
ప్రజాప్రతినిధుల ఒత్తిడితో..
పేరుకే టెండర్లు
అనుకూలమైన వారికి రాకపోతే రద్దు
నగరంలో రూ.72 కోట్లకు సంబంధించి మూడు పనులకు గ్రహణం
విజయవాడలో 15 మంది కాంట్రాక్టర్‌లు రింగ్
ముగ్గురు కాంట్రాక్టర్‌లకు పనులు ఇచ్చేలా ఒప్పందం
టెండర్‌లో తక్కువ ధరకు కోట్ చేసినా బిడ్లు తెరవకుండానే రద్దుకు యత్నాలు
తెరవెనుక చక్రం తిప్పుతున్న ఇంజనీరింగ్ అధికారులు!
బల్లెంవారి వీధి
నుంచి పోరంకి వెళ్లేదారి ఇలా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కూటమి ప్రభుత్వంలో టెండర్లలోనూ మతలబు జరుగుతోంది. నిబంధనలకు ‘టెండర్’ పెడుతూ నీరుగారుస్తున్నారు. అవి పేరుకే టెండర్లుగానీ తాము సూచించిన, అనుకూలమైన వారికి దక్కపోతే, నిబంధనలు పట్టించుకోకుండా ఎలాంటి కారణం చూపకుండానే రద్దు చేస్తున్నారు. ఈ టెండర్ల విషయంలోను ఓ మంత్రి, ఇంజినీరింగ్ ఉన్నతాధికారులే చక్రం తిప్పుతున్నారు. వివరాల్లోకి వెళితే .. విజయవాడ నగరపాలక సంస్థ్ధ పరిధిలో మూడు రోడ్లకు సంబంధించి రూ.72 కోట్ల పనులకు పబ్లిక్ హెల్త్ క్వాలిటీ కంట్రోల్ సర్కిల్, గుంటూరు, గతేడాది డిసెంబరు15న టెండర్లు పిలిచింది. ఆ నెల 30వ తేదీ టెండర్ దాఖలకు చివరి గడువుగా నిర్ణయించారు. అ రోజు సాయంత్రం మూడు పనుల టెక్నికల్ బిడ్ ఓపెన్ చేశారు. ఇందులో తొమ్మిది మంది కాంట్రాక్టర్లు అర్హత సాధించారు. ప్రైస్ బిడ్ ఓపెన్ చేసి ఎవ్వరూ తక్కువ ధరకు టెండర్ కోట్ చేశారో వారికి పనులు అప్పగించాల్సింది. అయితే టెండర్ నోటీసులో ప్రైస్ బిడ్ ఎప్పుడు ఓపెన్ చేసేది తేదీని మాత్రం సూచించలేదు. టెండర్ దాఖలు సమయంలోనే 15 మంది కాంట్రాక్టర్లు రింగై, 5 శాతం మొత్తాన్ని గుడ్ విల్‌గా తీసుకొని పంచుకున్నారని తెలుస్తోంది. పనులు దక్కిన కాంట్రాక్టర్ నియోజక వర్గ ప్రజా ప్రతినిధులతో మాట్లాడుకొనేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. రింగ్ ద్వారా నిర్ణయించిన ముగ్గురు కాంట్రాక్టర్లు టెండర్ ధర కంటే అధికంగా బిడ్ దాఖలు చేశారు. వీరు కాకుండా మరో ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్ ధర కంటే తక్కువకు బిడ్ దాఖలు చేశారు. రింగ్ అయి సూచించిన వారికి టెండర్లు దక్కవనే భావనతో తాజాగా మళ్లీ రద్దు చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే గుంటూరు పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ నుంచి పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం. పనులు రద్దు చేసి తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా నిబంధనలతో స్వల్పకాలిక టెండర్ పిలవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే పలుసార్లు వాయిదా.. టెండర్ రద్దు
విజయవాడలో బల్లెంవారివీధి జంక్షన్‌నుంచి నిడమాను రోడ్డు వరకు రోడ్డు విస్తరణ, సెంట్రల్ డివైడర్ తదితర పనులకు రూ.26,51,89,658, బల్లెంవారి వీధి నుంచి పోరంకి, నిడమానురు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులకు రూ. 25, 52,45, 567, బందరు రోడ్డు నుంచి హెచ్‌టీ లైన్ జంక్షన్, బల్లెంవారి వీధి వరకు రోడ్డు విస్తరణ, సెంట్రల్ డివైడర్ నిర్మాణానికి రూ.22,96,21,066తో పై మూడు పనులకు గత ఏడాది ఆగస్టులో టెండర్లు పిలిచారు. ఇలా మూడు పర్యాయాలు టెండర్లు పిలిచి కారణం చెప్పకుండా టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయకుండా వాయిదాలు వేసి, చివరకు పనులు రద్దు చేశారు. వీటితో పాటు గుంటూరు ఇన్నర్‌రింగ్ మూడో దశ నిర్మాణానికి రూ.34,87,28,545తో టెండర్ పిలిచారు. ఈ నాలుగు పనులతో కలిపి మొత్తం పది పనులకు సీఆర్‌డీఏ రూ.793.22 కోట్లతో టెండర్లు పిలిచింది. వీటన్నింటినీ ఓ మంత్రి.. ఇద్దరు కాంట్రాక్టర్లకు కట్టబెట్టేలా ఒప్పందం చేసుకున్నారు. మంత్రి సూచించిన ఇద్దరు కాకుండా మరో నలుగురు వ్యక్తులు టెండర్‌లో పాల్గొన్నారు. దీంతో తాము సూచించిన కాంట్రాక్టర్లకు పనులు దక్కవని గ్రహించిన మంత్రి కారణం లేకుండా, పనులను రద్దు చేయించారు. టెక్నికల్ బిడ్ ఓపెన్ చేశాక ఎలాంటి సహేతుకమైన కారణాలు లేకుండా టెండర్లు రద్దు చేస్తుంటే, విజిలెన్స్ డిపార్ట్ మెంట్ సైతం నిద్ర మత్తులో ఉండటం గమనార్హం.
గుంటూరు ఇన్నర్‌రింగ్ రోడ్డు పనిని...
గుంటూరు ఇన్నర్‌రింగ్ రోడ్డు పనికి కాంట్రాక్టర్లు రింగ్ అయ్యి , తాము సూచించిన కాంట్రాక్ట్ సంస్థకు దక్కేలా పావులు కదిపారు. దీనికి ఇంజినీరింగ్ అధికారులు టెండర్లలో కఠిన నిబంధనలు పెట్టారు. దీంతో మధ్యస్థాయి, ఇతర కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనే అవకాశం లేకపోయింది. దీంతో రింగ్‌గా మారి తాము నిర్ణయించిన సంస్థకే 3.49 శాతం అధిక ధరకు టెండర్ దక్కింది. ఆగస్టులోనే ఈ పనికి టెండర్ ఓపెన్ చేసి ఉంటే కొంత మంది 6.6 శాతం తక్కువ ధరకు కోట్ చేశారని, కాంట్రాక్టు వర్గాల్లోనే చర్చ సాగుతోంది. ఈ పనుల టెండర్ల విషయంలో కొంతమంది కాంట్రాక్టర్లు కోర్టుకెళ్లే ఆలోచన చేస్తున్నారని తెలిసింది. ఈ పనులపై పబ్లిక్‌హెల్త్ ఇంజినీరింగ్ అధికారులను వివరణ కోరగా.. విజయవాడ పనుల టెండర్ల అంశాన్ని గుంటూరు ఎస్‌ఈ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలిస్తోందని తెలిపారు. నిబంధనల మేరకే టెండర్లు ఉంటాయని, పనులు జరుగుతాయని పేర్కొన్నారు.
గుంటూరు, విజయవాడకు చెందిన ప్రజాప్రతినిధులు సీఆర్‌డీఏ నిధులను తమకు ఇచ్చి మా పరిధిలోనే పనులు జరిగేలా చూడాలని మంత్రిని కోరారు. ఆయన గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు, విజయవాడలోని మూడు రోడ్లు, మొత్తం రూ.105 కోట్ల పనులను పబ్లిక్ హెల్త్ క్వాలిటీ కంట్రోల్ సర్కిల్, గుంటూరుకు టెండర్లు జారీ చేసి, పనులు చేయించే బాధ్యతను అప్పజెప్పారు. మళ్లీ విజయవాడలో మూడు పనుల కోసం డిసెంబరు 1న టెండర్లు పిలిచారు. తాజాగా ఇప్పుడు కూడా తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లలకు పనులు దక్కే పరిస్థితి లేదని గ్రహించిన అధికారులు, ప్రైస్ బిడ్ తెరువకుండానే రద్దు చేసేందుకు పావులు కదుపుతున్నారు.
నిబంధనలకు టెండర్!


