క్రీస్తు బోధనల సారం.. జోసఫ్ తంబి జీవితం
పెద్దఅవుటపల్లి(గన్నవరం): ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లిలో బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో గత మూడు రోజులుగా జరుగుతున్న 81వ వర్ధంతి మహోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయవాడ మేత్రాసనం పీఠాధిపతులు తెలగతోటి జోసఫ్ రాజారావు నేతృత్వంలో సమష్టి దివ్యబలిపూజను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ దేవుని బిడ్డలుగా జీవించాలంటే పవిత్రత, వినయ, విధేయతలు కలిగి ఉండాలని చెప్పారు. ప్రేమ, సేవాగుణం కలిగి ఉండి అవసరతలో ఉన్నవారికి సహాయం చేయాలని తెలిపారు. క్రీస్తు బోధనలకు అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకున్న బ్రదర్ జోసఫ్ తంబి ధన్యుడని చెప్పారు. వినమ్రుడు, దయాగుణం కలిగిన తంబి కష్టాల్లో కూడా దేవుడి సేవ మరువలేదని గుర్తుచేశారు. మహోన్నతుడైన తంబి ఇక్కడ నివసించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా తెలిపారు. అనంతరం బిషప్‌ను పుణ్యక్షేత్ర రెక్టర్ జోసఫ్ పాలడుగు, విచారణ గురువులు అభిలాష్ గోపు సత్కరించారు.
అందరికీ కృతజ్ఞతలు..
సాయంత్రం పెద్దఅవుటపల్లి విచారణ గురువులు ఆధ్వర్యంలో కృతజ్ఞత సమష్టి దివ్యబలిపూజను సమర్పించారు. దేవుడి కృప వల్లే తంబి 81వ వర్ధంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయని జోసఫ్ తెలిపారు. అందుకు తంబి మద్యస్థ ప్రార్థనలు కూడా తోడయ్యాయని చెప్పారు. ఉత్సవాలు విజయవంతం జరిగేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బ్రదర్ జోసఫ్ తంబి గాయక బృందం, ఫాదర్ గొలమూరి సుధాకర్ గాయక బృందం అలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. ప్రొవిన్సియల్ రెవ. ఫాదర్ ప్రత్తిపాటి మరియదాసు, పలువురు విచారణ గురువులు పాల్గొన్నారు. చివరి రోజున బ్రదర్ జోసఫ్ తంబి సమాధిని దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళల నుంచి భక్తులు రావడంతో పుణ్యక్షేత్రం జన సంద్రంగా మారింది.


