తిరుపతమ్మ సేవలో తెలంగాణ డెప్యూటీ సీఎం
పెనుగంచిప్రోలు: శ్రీ తిరుపతమ్మ వారిని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ముందుగా అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. అధికారులు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు. ఆయన మాట్లాడుతూ కనుమ రోజున ఎంతో మహిమ కలిగిన అమ్మవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలుగు ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుడు చుంచు రమేష్, ఏఈఓ జంగం శ్రీనివాసరావు, ఆలయ మాజీ చైర్మన్ వాసిరెడ్డి బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.
దుర్గమ్మకు పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శుక్రవారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన గడ్డం వెంకట శివాజీ దంపతులు ఆలయ అభివృద్ధి నిమిత్తం రూ.1,00,116, దుర్గమ్మ గోసంరక్షణ పథకానికి హైదరాబాద్ రామకృష్ణాపురానికి చెందిన కూర్మాల పాండురంగారావు కుటుంబం కూర్మాల భవ్యశ్రీ పేరిట రూ. లక్ష, అమ్మవారి నిత్యాన్నదానానికి బోలిశెట్టి వెంకట శివశంకర్ కుమార్, శ్రీదేవి పేరిట కుటుంబ సభ్యులు రూ. 1,51,116 విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
కేసరపల్లిలో రూ. కోటి కోడి పందెం
గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లిలో జరుగుతున్న కోడి పందేల శిబిరంలో శుక్రవారం జరిగిన కోటి రూపాయల పందెం హైలెట్‌గా నిలిచింది. ఈ పందెంలో ఎక్స్‌నెక్స్ కంపెనీకి చెందిన అమర్ సేతువ పుంజును దింపగా, అరవపల్లి సుబ్రహ్మణ్యం, కుర్ర శ్రీనివాసరావు, బీబీజీ మల్లికార్జునరెడ్డి సంయుక్తంగా డేగా పుంజును బరిలోకి దింపారు. సుమారు కొన్ని సెకన్ల పాటు హోరాహోరీగా జరిగిన ఈ పందెంలో సేతువ పుంజు విజయం సాధించగా అమర్ రూ. కోటి గెలుచుకున్నారు. ఈ పందెం గురించి నిర్వాహకులు ఉదయం నుంచి ప్రచారం చేయడంతో తిలకించేందుకు ఎక్కువ మంది జనం తరలివచ్చారు.
తిరుపతమ్మ సేవలో తెలంగాణ డెప్యూటీ సీఎం


