
బాస్కెట్ బాల్ విజేత హిందుస్థాన్ జట్టు
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు):సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఇన్విటేషనల్ పురుషుల బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ఫైనల్స్ బుధవారం రాత్రి సిద్ధార్థ కళాశాల మైదానంలో జరిగాయి. లయోలా కళాశాల(చైన్నె), హిందూస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(చైన్నె) జట్ల మధ్య ఫైనల్స్ పోటీ రసవత్తరంగా సాగింది. లయోలా జట్టుపై హిందుస్థాన్ జట్టు విజయం సాధించింది. హిందుస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ జట్టు 81 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. 46 పాయింట్లతో లయోలా కళాశాల రన్నరప్‌గా నిలిచింది. విజేత జట్టుకు రూ.75 వేల నగదు, రన్నరప్ జట్టుకు రూ.50 వేల నగదును సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య, అకాడమీ సభ్యులు కలిసి అందజేశారు. ఏపీ సీఐడీ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్, శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్, అకాడమీ అడ్వయిజర్ ప్రొఫెసర్ ఎల్‌కే మోహనరావు, శాప్ మాజీ చైర్మన్ అంకమ్మ చౌదరి, సిద్ధార్థ కళాశాల క్రీడా విభాగాధిపతి డాక్టర్ బాలకృష్ణారెడ్డి క్రీడాకారులను అభినందించారు.