
సేవా కార్యక్రమాల నిర్వహణ అభినందనీయం
జిల్లా ఎస్పీ గంగాధరరావు
పెడన: ప్రార్థించే పెదవులు కంటే సాయం చేసే చేతులు మిన్న అన్న విధంగా 1989 పోలీస్ బ్యాచ్ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. రామలక్ష్మీ వీవర్స్ కాలనీలోని అమ్మఫుడ్ ఫౌండేషన్‌లో వృద్ధులకు 1989 పోలీస్ బ్యాచ్ బుధవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ బ్యాచ్ సేవా కార్యక్రమాలను నిర్వహించి అందరి మన్ననలు పొందుతున్నారని చెప్పారు. పెద్దలు ఆశీస్సులుతో మరింత మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. సంతృప్తికరమైన జీవితాన్ని ఆశ్వాదించడానికి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. అనంతరం అమ్మఫుడ్ ఫౌండేషన్ నిర్వాహకులు మల్లికార్జునరావు దంపతులను సన్మానించి వారికి రూ.10వేల నగదు అందజేశారు. 1989 పోలీస్ బ్యాచ్‌లో ఉత్తమసేవా అవార్డులు పొందిన కొసనం హేమానందం, లక్ష్మణరావులను, ఇతర రాష్ట్రాల్లో ఆట పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన జి.ఉమామహేశ్వరరావు, అంజిబాబులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు, ఏఎస్‌లు, కానిస్టేబుళ్లు వి. రాజేంద్రప్రసాద్, వీరవల్లి గోపీ, రణధీర్, అడపా వెంకటేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం మార్గదర్శకాలకు అనుగుణంగానే ఎంబీబీఎస్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. అశోక్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7న ప్రారంభమైన పరీక్షలు, 21 వరకూ కొనసాగనున్నాయని, తమ విద్యార్థులతో పాటు, ఎన్‌ఆర్‌ఐ, నిమ్రా కళాశాలల విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. పరీక్ష హాలుకు అనధికారికంగా ఎవరూ వెళ్లకుండా గ్రిల్స్ ఏర్పాటు చేశామని, పర్యవేక్షకులుగా అధ్యాపకులనే నియమించినట్లు పేర్కొన్నారు. సీసీటీవీ పర్యవేక్షణతో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగించకుండా తనిఖీలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రశ్నాపత్రాలను సైతం ఉదయం 9.40 గంటల తర్వాతే డౌన్‌లోడ్ చేస్తున్నామని వివరించారు. డీఎంఈ, రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, పరీక్షల విభాగంలోని అన్ని బోధనేతర సిబ్బందిని మార్పు చేసినట్లు పేర్కొన్నారు. కఠినమైన ఏర్పాట్లు చేసినప్పటికీ కొన్ని మాల్ ప్రాక్టీస్ ఘటనలు జరిగాయని, ఇన్విజిలేటర్ల నుంచి వివరణలు కోరుతూ మెమోలు ఇచ్చినట్లు తెలిపారు.
రూ.4.30 లక్షలు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు
పెనమలూరు: పోరంకికి చెందిన వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.4.30 లక్షల సొమ్ము స్వాహా చేసిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం పోరంకి శ్రీనివాసానగర్, మధురిమ అపార్టుమెంట్‌కు చెందిన కె.వీరవెంకటనాగచక్రధర్ పశువులు దాణా వ్యాపారం చేస్తాడు. కొద్ది నెల క్రితం పనిపై బెంగళూరుకు వెళ్లాడు. తిరిగి బెంగళూరు నుంచి విజయవాడకు రావటానికి వీఆర్‌ఎల్ ట్రావెల్స్ బస్ టికెట్ తీసుకున్నాడు. అయితే బస్సు మిస్ అవ్వటంతో టికెట్ సొమ్ము తిరిగి ఇవ్వమని వీఆర్‌ఎల్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ ద్వారా లైన్‌లోకి వచ్చి వీరవెంకటనాగచక్రధర్ నమ్మించి బ్యాంకు ఖాతా నెంబర్, ఐడీ, పాస్ వర్డ్ తీసుకున్నాడు. ఆ తరువాత ఫోన్ బ్లాక్‌చేసి అతని బ్యాంకు ఖాతాలో రూ.4.30 లక్షల సొమ్ము స్వాహా చేశాడు. ఈ ఘటన పై బాధితుడు పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు.