
దుర్గగుడి అభివృద్ధి పనులకు విరాళం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకంతో పాటు పలు అభివృద్ధి పనులకు గుంటూరుకు చెందిన వై. మధుసూదనరావు విరాళం అందజేశారు. నిత్యాన్నదానానికి రూ. లక్ష, బంగారు గోపురం అభివృద్ధి పనుల నిమిత్తం మరో రూ. లక్ష, దేవస్థానంలో గో సంరక్షణ నిమిత్తం రూ.లక్ష, శివాలయం అభివృద్ధి పనులకు రూ.15,101 కలిపి మొత్తం రూ.3,15,101 విరాళంగా సోమవారం ఆలయ అధికారులను కలిసి అందించారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులకు అమ్మవారి దర్శనం కల్పించి వేద పండితులతో ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. అనంతరం దాతకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
వైభవంగా ద్వాదశ ప్రదక్షిణలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపైగల దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి నిర్వహించిన ద్వాదశ ప్రదక్షిణలు వైభవంగా జరిగాయి. కల్యాణోత్సవం, నదీ విహారం అనంతరం స్వామివారి ఆలయం చుట్టూ ద్వాదశ అంశాలతో (12) ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ద్వాదశ ప్రదక్షిణల్లో పంచ వాయిద్యం, వేద పఠనం, రుద్ర సూక్తం, స్త్రోత్ర పఠనం, భేరి, కాహలకం (కొమ్ము బూర), కాంస్య నాదం, మురళీ నాదం, గానం, నృత్యం, మౌనం అనే అంశాలతో ప్రదక్షిణలు చేశారు. అనంతరం అద్దాల మండపంలో పవళింపు సేవ నిర్వహించారు.
ఉద్యోగోన్నతుల విషయంలో అన్యాయం
విజయవాడరూరల్: పంచాయతీరాజ్ శాఖ మండల పరిషత్, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో అడ్మినిస్ట్రేటివ్ అధికారులు(ఏఓ)గా పని చేస్తున్న వారికి ఉద్యోన్నతులు కల్పించే విషయంలో ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏఓల సమావేశం తీర్మానించింది. సోమవారం విజయవాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఏపీ పంచాయతీరాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశం అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన జరిగింది. ఎంపీడీఓలుగా ఉద్యోగోన్నతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం జీఓ–35 ద్వారా ఈఓపీఆర్డీలకు రెండు వంతులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు ఒక వంతు చొప్పున కేటాయించడం అన్యాయమని సమావేశం పేర్కొంది. జీఓ–35ని సవరించాలని సమావేశం డిమాండ్ చేసింది. పి.కృష్ణప్రసాద్, ఎస్‌కే బాబూరావు, రవికుమార్, విజయ్‌కుమార్, పలు జిల్లాల నుంచి ఏఓలు సమావేశంలో పాల్గొన్నారు.
కొనసాగుతున్న కల్యాణోత్సవాలు
జగ్గయ్యపేట: తిరుమలగిరిలో వేంచేసియున్న వాల్మీదకోద్భవ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారికి సోమవారం కలశ స్నాపనం, సప్తముని పూజా సదస్యం, మహానివేదనం, నిత్యహోమం, బలిహరణ, ఆస్థానోత్సవ కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకుడు తిరునగరి రామకృష్ణమాచార్యులు, పరాంకుశం వాసుదేవాచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ సదస్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ చైర్మన్ భరద్వాజ్, ఏసీ ప్రసాద్, వేద పండితులు పాల్గొన్నారు. రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

దుర్గగుడి అభివృద్ధి పనులకు విరాళం

దుర్గగుడి అభివృద్ధి పనులకు విరాళం

దుర్గగుడి అభివృద్ధి పనులకు విరాళం