
పటిష్టంగా అట్రాసిటీ చట్టం అమలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా, కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా అధికారులు చొరవ చూపాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు అన్నారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల రక్షణతో పాటు ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం–జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సమావేశం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగింది. అట్రాసిటీ కేసుల విచారణలో పురోగతి, బాధితులకు పరిహారం, క్షేత్రస్థాయిలో పౌర హక్కుల రక్షణకు తీసుకుంటున్న చర్యలు తదితరాలపై సమావేశంలో చర్చించారు.
సమన్వయంతో పనిచేయాలి..
కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని.. చట్టం పటిష్టంగా అమలుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పరిహారం అందించేందుకు, కేసుల సత్వర విచారణలో ఎలాంటి అవరోధాలు ఎదురుకాకుండా చూడాలని, కులధ్రువీకరణ, మెడికల్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. 2022, ఏప్రిల్ 4 నుంచి ఇప్పటి వరకు తిరువూరు డివిజన్‌లో పది కేసుల్లో బాధితులకు రూ. 10.75లక్షలు, విజయవాడ డివిజన్‌లో 150 కేసుల్లో బాధితులకు రూ. 1,78,21,250, నందిగామ డివిజన్‌లో 56 కేసుల్లో బాధితులకు రూ.65 లక్షలు మేర మొత్తం 216 కేసుల్లో దాదాపు రూ. 2.54 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించామన్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించారు.
కేసుల వివరాలు ఇవీ..
సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ 2023, డిసెంబర్ 21 నుంచి 2024, డిసెంబర్ 31 వరకు పశ్చిమ, దక్షిణ, ఉత్తర, మధ్య డివిజన్లతో పాటు నందిగామ డివిజన్, మైలవరం డివిజన్, మహిళా పీఎస్ పరిధిలో వేధింపుల నిరోధక చట్టానికి సంబంధించి 31 పెండింగ్ అండర్ ఇన్వెస్టిగేషన్, 30 పెండింగ్ ట్రయల్ కేసులు ఉన్నట్లు వివరించారు. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె.శ్రీనివాస శిరోమణి, డీఆర్‌వో ఎం. లక్ష్మీనరసింహం, డీసీపీ కేజీవీ సరిత, ఆర్డీఓలు కావూరి చైతన్య, కె.బాలకృష్ణ, కె.మాధురి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
డీవీఎంసీ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు