సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): స్థాని క సత్యనారాయణపురం, గిరివీధిలోని అభయ విఘ్నేశ్వర ఆలయంలోకి దొంగలు చోరబడి హుండీ చోరీకి విఫలయత్నం చేశారు. పోలీసులు, ఆలయ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చారు. వినాయకుని గుడి ఎదుట ఉన్న హుండీని గడ్డపారతో పగులకొడుతుండగా, ఆ శబ్దాలు విన్న పక్కనే ఎస్‌బీఐ ఏటీఎంలో సెక్యూరిటీ గార్డు అక్కడకు రావడంతో ముగ్గురు దుండగులు ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. విషయం తెలియడంతో ఆలయ నిర్వాహకులు ఎస్‌ఎన్‌పురం పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ లక్ష్మీనారాయణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి పల్సర్ వాహనంపై ముగ్గురు నిందితులు చోరీకి యత్నం చేసినట్లు గుర్తించారు. వారు గుంటూరు జిల్లా తాడేపల్లిలో అదే రోజు మధ్యరాత్రి 12.50కి ఒక ఇంటి ముందు పల్సర్ వాహనం చోరీ చేసి దానిపైనే సత్యనారాయణపురంలోని విఘ్నేశ్వర ఆలయంలో చోరీకి యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు.