
మొత్తం ధాన్యం కొనాల్సిందే
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశను కోరారు. ఈ మేరకు రైతులతో కలిసి మంగళవారం ఆయన కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్‌కు వివరించారు. ధాన్యం తడవడంతో తక్కువ ధరకు మధ్యవర్తులకు విక్రయించి నష్టపోతున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని తేమతో సంబంధం లేకుండా మద్దతు ధరపై పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని కోరారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం సంచులు సరిపడా నిల్వ ఉంచాలని.. ధాన్యం తరలింపులో ఎక్కడ వాహనాల కొరత రాకుండా, కొనుగోళ్లలో ఎక్కడా జాప్యం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం విఫలం..
అనంతరం కలెక్టరేట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ తాము చేసిన వినతిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పడం తప్ప ఇప్పటివరకు వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ మంత్రి కనీసం సమీక్ష నిర్వహించిన పాపాన పోలేదన్నారు. జిల్లాలో వారం రోజుల క్రితమే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన సంబంధిత శాఖల అధికారులు మొద్దునిద్ర పోతున్నారన్నారు. ఓ వైపు వాతావరణ శాఖ పదేపదే హెచ్చరిస్తున్నా.. అధికార యంత్రాంగం మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వ్యవసాయ, పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారుల కాలయాపనతో రైతులకు అవస్థలు తప్పడం లేదన్నారు. లారీలు రావట్లేదని, వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో రైతులు దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దేవిరెడ్డి మంగారెడ్డి, వాకాడ రాము, నల్లమోతు చినబాబు, పామర్తి వెంకయ్య, జాజుల నాగేశ్వరరావు, సుబ్బారెడ్డి, శేషిరెడ్డి, యరగొర్ల శ్రీరాములు ఉన్నారు.
రైతులతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన మల్లాది విష్ణు