
డైట్ అధ్యాపకుల నియామక అర్హతలు సడలించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డెప్యూటేషన్ పద్ధతిలో డైట్ అధ్యాపకుల నియామకానికి పోస్టు గ్రాడ్యుయేషన్, 55 శాతం మార్కులు అర్హతగా నిర్ణయించారని, దీనిని 50 శాతానికి తగ్గించాలని డీపీఆర్టీయూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డి.శ్రీను కోరారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయ రామరాజును ఆయన కార్యాలయం విద్యా భవన్‌లో మంగళవారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. శ్రీను మాట్లాడుతూ.. ఏపీ రాష్ట్ర విద్యా శాఖ నూతన విద్యాసంస్కరణలలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన క్లస్టర్ ప్రధానోపాధ్యాయుల పోస్టును గ్రేడ్ – 1 ప్రధానోపాధ్యాయులుగా ఉన్నతీకరించాలన్నారు. సీనియర్ హెచ్‌ఎంలకు ఉద్యోగోన్నతులు కల్పించి వారిని క్లస్టర్ హెచ్‌ఎంలుగా నియమించాలని కోరారు. ఉపాధ్యాయ సమస్యల చర్చించే నిమిత్తం రిజిస్టర్ , క్యాడర్ సంఘాలను కూడా సమావేశాలకు ఆహ్వానించాలని, మూడేళ్ల లోపు సర్వీసు ఉన్న ఉపాధ్యాయులను బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులకు 12 నెలల జీతం(ఒక రోజు వేతనం మినహాయించి) ఇవ్వాలని, వారికి పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని, భాషా పండితుల ఉద్యోగోన్నతుల విధి విధానాలు ప్రకటించాలని కోరారు. దీనిపై డైరెక్టర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.