వృత్తి పన్ను భారం రూ.200 కోట్లు | - | Sakshi
Sakshi News home page

వృత్తి పన్ను భారం రూ.200 కోట్లు

Apr 5 2025 2:12 AM | Updated on Apr 5 2025 2:12 AM

వృత్తి పన్ను భారం రూ.200 కోట్లు

వృత్తి పన్ను భారం రూ.200 కోట్లు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): కూటమి సర్కార్‌ విజయవాడ నగర ప్రజలపై వృత్తి పన్ను ద్వారా రూ.200 కోట్ల భారం మోపనుంది. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై భారాలు వేయటమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా విజయవాడలోని వ్యాపార, వాణిజ్య వర్గాలతో పాటుగా చిరు ఉద్యోగుల నుంచి సైతం వృత్తి పన్ను ముక్కుపిండి వసూలు చేయటానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న దుకాణాలు, ఉద్యోగుల నుంచి వృత్తి పన్నును వసూలు చేయటానికి వాణిజ్య పన్నుల శాఖ అధికారులను సమాయత్తం చేస్తోంది. ఇప్పటికే ఆయా డివిజన్‌ల ఉన్నతాధికారులు సర్కిల్‌ కార్యాలయాలకు వివిధ రూపాల్లో ఉత్తర్వులు జారీ చేశారు.

వీఎంసీ నుంచి వాణిజ్య పన్నుల శాఖ చేతికి...

వ్యాపార, వాణిజ్య వర్గాల నుంచి వృత్తి పన్ను వసూళ్లు రాష్ట్రం మొత్తం వాణిజ్య పన్నుల శాఖే నిర్వహిస్తుంది. అయితే రాష్ట్రంలోని విజయవాడ నగర పాలక సంస్థ, విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధుల్లో మాత్రమే ఆయా స్థానిక సంస్థలు వృత్తి పన్నును వసూలు చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో వృత్తిపన్ను మీద ఆశించిన స్థాయిలో ఆదాయం రావటం లేదని ప్రభుత్వం గుర్తించింది. దానికి తోడు ఆయా నగర పాలక సంస్థ పరిధుల్లో అధికారులు వారివారి విధుల్లో బిజీగా ఉండటం వలన వృత్తి పన్ను మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడం లేదని ప్రభుత్వం భావించింది. నగర పాలక సంస్థల వద్ద ఉన్న వ్యాపార వర్గాల సమాచారం, వాణిజ్య పన్నుల శాఖ వద్ద ఉన్న డీలర్ల సంఖ్యకు భారీ వ్యత్యాసం ఉండటంతో వసూళ్లపై ప్రభుత్వానికి కన్ను పడింది. వృత్తి పన్ను వసూళ్లకు ఈ రెండు ప్రధాన నగరాలను వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోకి తీసుకొస్తే భారీగా ఆదాయం వస్తుందని గ్రహించింది. దాంతో ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవాడ, విశాఖపట్నం పరిధుల్లోనూ వాణిజ్య పన్నుల శాఖే వృత్తి పన్ను వసూళ్లకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నగర ప్రజలపై ఏడెనిమిది రెట్లు భారం 1 నుంచి వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోకి వృత్తి పన్ను వసూళ్లు షాప్‌ టు షాప్‌ తిరగాలని అధికారులకు ఆదేశాలు ఇప్పటి వరకూ వసూళ్లు ఏడాదికి రూ.28 కోట్లు మాత్రమే

నిబంధనల ప్రకారమే వృత్తి పన్ను

ఏప్రిల్‌ మొదటి తేదీ నుంచి విజయవాడలో వృత్తి పన్ను వసూలు వాణజ్య పన్నుల శాఖ పరిధిలోకి వచ్చింది. వృత్తి పన్ను ఎవరు కట్టాలనే అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మా వద్ద ఉన్న సమాచారం మేరకు ఎవరెవరు కట్టాలనే విషయాలను గుర్తించి వారి నుంచి వృత్తి పన్ను వసూలు చేస్తాం.

– షేక్‌ జహీర్‌, డెప్యూటీ కమిషనర్‌, వాణిజ్య పన్నుల శాఖ, విజయవాడ డివిజన్‌–1

రూ.28 కోట్ల నుంచి రూ.200 కోట్లు

వాణిజ్య పన్నుల శాఖకు ఉమ్మడి కృష్ణాజిల్లాలో మూడు డివిజన్‌ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. అందులో విజయవాడ నగర పాలక సంస్థ పరిధికి సంబంధించి విజయవాడ డివిజన్‌–2 కార్యాలయం అత్యధికంగా ఉంటుంది. ఇప్పటివరకూ విజయవాడ నగర పాలక సంస్థ వృత్తి పన్ను ద్వారా ఏడాదికి రూ.28 కోట్లు మాత్రమే వసూలు చేస్తోందని అధికారులు చెబుతున్నారు. అయితే వాణిజ్య పన్నుల శాఖ వద్ద ఉన్న డీలర్ల సంఖ్య, ఉద్యోగులు తదితర వివరాలను క్రోడీకరిస్తే సుమారుగా రూ.200 కోట్ల మేర ఆదాయాన్ని పొందవచ్చని ఉన్నతాధికారులు లెక్క వేశారు. వేసిందే తడవుగా విజయవాడలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, సిబ్బంది తమతమ సర్కిల్‌ కార్యాలయ పరిధుల్లో షాప్‌ టు షాప్‌ తిరిగి వృత్తి పన్ను వసూళ్లకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ ఉద్యోగ విధులతో పాటుగా వెబ్‌ కాన్ఫరెన్స్‌లు, ఇతర సమావేశాలకే అల్లాడుతుంటే కొత్తగా ఈ వృత్తి పన్ను వసూళ్ల పని భారం తమపై రుద్దటం ఏమిటని ఉద్యోగ సంఘాల నేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement