ఈడుపుగల్లులో బస్సు బీభత్సం
భీతిల్లిన డ్వాక్రా మహిళలు
కంకిపాడు: సీఎం సభకు వెళ్లొచ్చిన ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించిన ఘటన మండలంలోని ఈడుపుగల్లు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. ఉగాది పర్వదినం సందర్భంగా రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నిర్వహించిన సభకు ఈడుపుగల్లు గ్రామం నుంచి డ్వాక్రా మహిళలు, వెలుగు సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆర్టీసీ బస్సులో తరలివెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఈడుపుగల్లు చేరుకున్న ఆర్టీసీ బస్సు శివాలయం సెంటరులో మలుపు తిప్పుతుండగా బస్సు అదుపుతప్పి సిమెంటు రోడ్డు మార్జిన్ దిగింది. ఇటీవలే సిమెంటు రోడ్డు నిర్మించినా బరంతు మాత్రం వేయలేదు. దీంతో బస్సు మలుపు సక్రమంగా తిరగక శివాలయం ప్రహరీని పలు మార్లు ఢీకొంది. దీంతో బస్సులో ఉన్న డ్వాక్రా మహిళలు, వెలుగు సిబ్బంది భయంతో భీతిల్లారు. అప్పటికే ఎస్సీ కాలనీకి వెళ్లేందుకు వచ్చిన ప్రజలు, వాహనదారులు, రాకపోకలకు అడ్డుగా బస్సు నిలిచిపోవటంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. బస్సు డ్రైవరు నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.


