రసవత్తరంగా కబడ్డీ పోటీలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక సీతారామ గార్డెన్స్ ఆవరణలో జరుగుతున్న 51వ జాతీయ జూనియర్ కబడ్డీ చాంపియన్ షిప్ పోటీల్లో భాగంగా శనివారం ప్రీ–క్వార్టర్ ఫైనల్ పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. తొలుత కబడ్డీ క్రీడాకారులను రైల్వే క్‌లైమ్స్ ట్రిబ్యునల్ అడిషనల్ డైరెక్టర్ కె.రాజేంద్రప్రసాద్ పరిచయం చేసుకుని పోటీలను వీక్షించారు.
శనివారం సాయంత్రం జరిగిన ప్రీ–క్వార్టర్ ఫైనల్ పోటీల్లో హర్యానా టీమ్ 58 పాయింట్లు సాధించగా ఆంధ్ర జట్టు కేవలం 27 పాయింట్లు సాధించి పరాజయం పాలైంది. చండీఘర్, మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరిగిన పోటీలో చండీఘర్ జట్టు–52, మధ్యప్రదేశ్ జట్టు–40 పాయింట్లు సాధించగా చండీఘర్ జట్టు విజయం సాధించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టీమ్–73 పాయింట్లు సాధించగా పంజాబ్ కేవలం 30 పాయింట్లు మాత్రమే సాధించి ఓటమి పాలైంది. చత్తీస్‌ఘడ్, ఉత్తరాంచల్ జట్ల మధ్య జరిగిన రసవత్తర పోటీలో చత్తీస్‌ఘడ్–51, ఉత్తరాంచల్–50 పాయింట్లు సాధించాయి. ఒకే ఒక్క పాయింట్ తేడాతో ఛత్తీస్‌ఘడ్ విజయాన్ని కై వసం చేసుకుంది. గోవా, కర్ణాటక జట్ల మధ్య, తమిళనాడు, మహారాష్ట్ర జట్ల మధ్య మ్యాచ్‌లు కూడా రసవత్తరంగా జరిగాయి.
మావోయిస్టులను విచారించిన పోలీసులు
పెనమలూరు: కానూరులో గత ఏడాది నవంబర్‌లో పట్టుబడిన మావోయిస్టులలో ముగ్గురిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని శనివారం పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. పోలీసుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం గత ఏడాది నవంబర్‌లో కానూరు ఆటోనగర్‌లో దాదాపు 28 మంది మావోయిస్టులు ఒక భవనంలో నివాసం ఉంటుండగా పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేసి పట్టుకున్నారు. వారిని కోర్టులో హాజరుపర్చగా కోర్టు రాజమండ్రి సెంట్రల్ జైల్‌కు రిమాండ్ విధించింది. ఈ కేసులో లోతైన విచారణ చేయటానికి పెనమలూరు పోలీసులు ఏపీ హైకోర్టులో కస్టడీకి పిటీషన్ వేయగా, కోర్టు రెండు రోజులు కస్టడీకి అనుమతించింది. దీంతో రాజమండ్రి జైల్ నుంచి మావోయిస్టులు యు.రఘు, ఓఎం జ్యోతి, మడకం దివాకర్‌లను పోలీసులు కస్టడీకి తీసుకుని శనివారం పెనమలూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావు బందోబస్తు మధ్య వారిని విచారించారు.
అగ్ని ప్రమాదంలో వాచ్‌మెన్ సజీవ దహనం
విస్సన్నపేట: స్థానిక రెడ్డిగూడెం రోడ్డులో ఉన్న పాత ఇనుప సామాన్ల షాపులో ఓ వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించి సజీవదహనం అయిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం రెడ్డిగూడెం మండలం తాడిగూడెంకు చెందిన దిరిసినపు ప్రకాశరావు(55) పాత ఇనుప సామాన్లు కొట్టు వద్ద వాచ్‌మెన్‌గా ఉంటాడు. శుక్రవారం రాత్రి నిద్రించే సమయంలో దోమలు రాకుండా కోడిగుడ్లకు వినియోగించే అట్టలను వెలిగించి నిద్రించాడు. ప్రకాశరావు గాఢ నిద్రలో ఉన్న సమయంలో మంటలు చెలరేగి ప్రకాశరావుకు అంటుకోవడంతో సజీవ దహనం అయ్యాడు. శనివారం తెల్లవారుజామున షాపు యజమాని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మూడో త్రైమాసికంలో రూ.5017 కోట్ల లాభం
యూనియన్ బ్యాంక్ జీఎం భాస్కరరావు
లబ్బీపేట(విజయవాడతూర్పు): యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 31, 2025తో ముగిసిన మూడో త్రైమాసికంలో బలమైన వృద్ధి, మెరుగైన ఆస్తుల నాణ్యత, స్థిరమైన లాభదాయకతను నమోదు చేసినట్లు ఆ బ్యాంక్ జీఎం సీవీఎన్ భాస్కరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడో త్రైమాసికంలో రూ.5017 కోట్లు నికర లాభం సాధించగా, వార్షిక సంవత్సరం తొమ్మిది నెలల్లో రూ.13,381 కోట్లు నికర లాభం నమోదు చేసినట్లు తెలిపారు. నికర వడ్డీ ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 5.85 శాతం వృద్ధిలో రూ.9.328 కోట్లుకు చేరినట్లు తెలిపారు. ఈక్విటీపై రాబడి 17.09 శాతం, ఆస్తులపై రాబడి 1.35 శాతం ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో బ్యాంక్ ప్రాజెక్ట్ ముస్కాన్‌ను ప్రారంభించిందని, దీని ద్వారా కార్యకలాపాల సరళీకరణ, ఆటోమేషన్, సిబ్బందికి పనుల సౌలభ్యం, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. డిజిటల్ రంగంలో, వ్యాపార కస్టమర్ల కోసం ప్రత్యేక యాప్, పునర్నిర్మిత నెట్ బ్యాంకింగ్, డిజిటల్ రామ్ ప్రయాణాలు, రుణ ఆటోమేషన్ అప్‌గ్రేడ్, వీడియో కేవైసీ వంటి కార్యక్రమాలను బ్యాంక్ అమలు చేస్తున్నట్లు జీఎం సీవీఎన్ భాస్కరరావు తెలిపారు.
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 22 నుంచి 26వ వరకు ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు శనివారం తెలిపారు.
రసవత్తరంగా కబడ్డీ పోటీలు


