దుర్గమ్మ సన్నిధిలో కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సంక్రాంతి రద్దీ శనివారం కూడా కొనసాగింది. సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణంలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం నుంచి భక్తుల రద్దీ కొనసాగింది. సర్వ దర్శనంతో పాటు రూ.100, రూ.300, రూ.500 టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు ఆయా క్యూలైన్ల ద్వారా ప్రధాన ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. మరో వైపున వీఐపీలు, బంధువులు, సిఫార్సులపై వచ్చే భక్తులు, యాత్రికులందరికీ రూ.500 టికెట్లను కొనుగోలు చేయాల్సిందిగా దేవస్థాన అధికారులు మైక్‌లో ప్రచారం చేయించారు. టికెట్లు కొనుగోలు చేయని వారికి రూ.100, రూ.300 క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతించారు. ఉదయం 10 గంటల తర్వాత రద్దీ మరింత అధికం కావడంతో ఆలయ అధికారులు స్కానింగ్ పాయింట్ వద్ద పలువురు అధికారులకు ప్రత్యేక విధులను కేటాయించారు. రద్దీతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం మహా నివేదన తర్వాత కూడా రద్దీ కొనసాగింది. సాయంత్రం అమ్మవారి పంచహారతులు, పల్లకీ సేవ, దర్బారు సేవలోనూ రద్దీ కనిపించింది.
దుర్గమ్మను దర్శించుకున్న కొరియోగ్రాఫర్ శేఖర్
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ శనివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన శేఖర్‌కు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు ప్రసాదాలను అందించారు.
రేపు కానుకల లెక్కింపు
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులు, ముడుపులను ఈనెల 19వ తేదీన లెక్కించనున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరో అంతస్తులో సోమవారం ఉదయం 7 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు


