ఆటో డ్రైవర్ నిజాయతీ
పటమట(విజయవాడతూర్పు): ఓ ఆటో డ్రైవర్ చూపిన నిజాయతీ అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆటోలో మర్చిపోయిన బ్యాగును ప్రయాణికురాలికి అప్పగించిన ఘటన పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పటమటలంకకు చెందిన అర్చన అనే మహిళ రమేష్ ఆసుపత్రి జంక్షన్ వద్ద తన కుటుంబ సభ్యులతో ఆటో కిరాయికి మాట్లాడుకుని ఎక్కారు. పటమటలంక డీ మార్ట్ వద్ద దిగి లోపలకు నడుచుకుంటూ వెళ్లారు. తిరిగి పటమట వరకు వెళ్లిన ఆటోడ్రైవర్ పెద్దిరాజు ఆటోలో బ్యాగు ఉన్నట్లు గుర్తించారు. బ్యాగు తీసుకుని పటమట పోలీస్ స్టేషనుకు వెళ్లి సమాచారం అందించారు. బ్యాగును పరిశీలించగా అందులో రూ.2 వేలు నగదు, 60 గ్రాముల బంగారు ఆభరణాలు, పలు గుర్తింపు కార్డులు ఉన్నాయి. బ్యాగులో ఉన్న ఆధార్ కార్డు ద్వారా పోలీసులు బ్యాగు పోగొట్టుకున్న అర్చనకు ఫోన్ చేసి సమాచారం అందించారు. అనంతరం పటమట సీఐ పవన్ కిషోర్ సమక్షంలో అర్చనకు ఆటోడ్రైవర్ పెద్దిరాజు బ్యాగును అందజేశారు.
మైలవరం: మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన యనమల గంగరాజు, జమలమ్మ దంపతుల కుమారుడు వెంకటరావు(20) శనివారం వెల్వడం అడ్డరోడ్డు వద్ద ఉన్న ఇటుక బట్టీలో కుండీ తొక్కుతున్న క్రమంలో ట్రాక్టర్ తిరగబడటంతో మృతి చెందాడు.


