మా నాన్న ఇంత దారుణానికి పాల్పడతాడనుకోలేదు
పెనమలూరు: తల్లిని తమ తండ్రి చంపటం జీర్ణించుకోలేక పోతున్నామని, తమ తండ్రికి కచ్చితంగా శిక్ష పడాలని మృతురాలు రేణుకాదేవి కుమార్తె, కుమారుడు ముక్కామల తేజశ్రీ, ముక్కామల నాగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పోరంకిలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ తమ తండ్రి ముక్కామల ప్రసాద్ చౌదరి ఆకునూరు ఝాన్సీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, తమ తల్లి అడ్డుగా ఉందని పథకం ప్రకారం హత్య చేశారని తెలిపారు. తమ పట్ల తండ్రి కపటప్రేమ చూపాడని, తల్లి పేరున ఉన్న ఇంటిని నమ్మకంగా తన పేరున రాయించుకున్నాడని అన్నారు. తమ తండ్రి ఇంత దారుణానికి ఒడికడతాడని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. సెల్‌ఫోన్ డేటా ఆధారంగానే తల్లి హత్య ఉదంతం వెలుగు చూసిందని అన్నారు. హత్య వెనుక పలువురు వ్యక్తుల ప్రమేయం ఉందని అనుమానాలు ఉన్నాయని దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేయాలని కోరారు.
నన్ను కూడా చంపాలని చూశారు...
తన తండ్రి ప్రసాద్‌చౌదరి, ఆయనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఝాన్సీ తనను కూడా హత్య చేయాలని చూశారని మృతురాలి కుమారుడు నాగేష్ ఆరోపించారు. తనకు ఇష్టం లేకపోయినా తనను యూకేకు బలవంతంగా పంపారని, తనను యూకేలోనే చంపాలని పథకం వేశారని అన్నారు. తాను యూకేకు వెళ్లిన 25 రోజుల్లోనే తల్లిని హత్య చేశారని చెప్పారు. దీంతో తాను ఇండియాకు వచ్చానన్నారు. ఇంత దారుణానికి పాల్పడిన తండ్రి ప్రసాద్‌చౌదరి, ఝాన్సీలకు శిక్షపడాలని అన్నారు.
మా నాన్న ఇంత దారుణానికి పాల్పడతాడనుకోలేదు


