సోనోవిజన్‌లో చోరీ
పటమట(విజయవాడతూర్పు): పటమట బందరురోడ్డులోని సోనోవిజన్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు షోరూంలోకి చొరబడి రూ.19 లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీ చేశారు. పటమట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోనో విజన్ ఎలక్ట్రానిక్స్ షోరూం స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్న దయాల రాజేంద్ర ప్రసాద్ చోరీపై పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పటమటలోని పోస్టల్ కాలనీ వద్ద ఉన్న సోనోవిజన్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో రోజూ లాగానే శనివారం ఉదయం 10 గంటలకు షోరూం ఓపెన్ చేయగానే సేల్స్ పర్సన్స్ అటెండెన్స్ కోసం ఫొటో తీసుకుంటుండగా అక్కడ ఉండాల్సిన ఫోన్లు చిందరవందరగా పడి ఉండడం గమనించారు. సిబ్బంది సమాచారం మేరకు అక్కడకు వెళ్లి చూడగా షోరూం ర్యాక్‌లో ఉండాల్సిన ఐఫోన్–10, ఒప్పోఫోన్లు –9, వీవో ఫోన్లు–8, శాంసంగ్–3 ఫోన్లు, వాటితోపాటు శాంసంగ్ యాక్ససిరీస్ కూడా చోరీ జరిగినట్టు గుర్తించారు. చోరీ అయిన ఫోన్ల విలువ సుమారు రూ.19 లక్షలు ఉంటుందని చెప్పారు. తమ షోరూం రినోవేషన్ పనులు జరుగుతున్నాయయని, గుర్తు తెలియని వ్యక్తులు షోరూం భవనం 3వ ఫ్లోర్ నుంచి టెర్రస్ మీదగా లిఫ్ట్ గోడకు ఉన్న రంధ్రాల్లో నుంచి షోరూంలోకి ప్రవేశించారని అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. క్లూస్‌టీం అక్కడ ఆధారాలు సేకరించింది. పటమట సీఐ పవన్ కిషోర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
23న శ్రీపంచమి వేడుకలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ) : మాఘ శుద్ధ పంచమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో ఈ నెల 23వ తేదీన శ్రీపంచమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. రానున్న వార్షిక పరీక్షలు, పోటీ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించాలని ఆకాంక్షిస్తూ పెన్నులు, కంకణాలను అమ్మవారి వద్ద ఉంచి పూజలు నిర్వహించి, వాటిని విద్యార్థులకు ఉచితంగా అందజేస్తారు. 500 మందికి ఉచితంగా సామూహిక అక్షరాభ్యాసాలను నిర్వహిస్తున్నామని దేవస్థానం పేర్కొంది.


