పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉగాది పర్వదినంతో పాటు సెలవు దినం కావటంతో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావటంతో ఆలయ క్యూలైన్లు, పరిసరాలు కిక్కిరిశాయి. వేకువ జాము నుంచే భక్తులు పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనా లు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు.
మాస్టర్ అథ్లెటిక్స్‌లో విజేతలకు సత్కారం
భవానీపురం(విజయవాడపశ్చిమ): బెంగళూరులో ఇటీవల నిర్వహించిన మాస్టర్ అథ్లెటిక్స్ జాతీయ స్థాయి పోటీలో కృష్ణాజిల్లా నుంచి 13 మంది పాల్గొనగా 8 మంది క్రీడాకారులు రెండు గోల్డ్, 10 మంది సిల్వర్, ఒకరు బ్రాంజ్ మెడల్స్ సాధించారు. వారిలో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలోని అథ్లెటిక్స్ అసోసియేషన్ హాల్‌లో విజేతలను సత్కరించారు. ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ (ఇంటెలిజన్స్) కె.మెహర్‌బాబు హాజరై విజేతలను అభినందించారు. కృష్ణా జిల్లా అధ్యక్షుడు కంది గంగాధరరావు, సెక్రటరీ జీవీ ప్రసాదరావు పాల్గొన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణానదిలో పున్నమి ఘాట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని భవానీపురం పోలీసులు తెలిపారు. మృతుడి వయసు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఐదున్నర అడుగుల ఎత్తు ఉన్నాడన్నారు. మృతుడి ఒంటిపై నలుపు, ఎరుపు రంగు గళ్ల షర్ట్, తెలుపు రంగుపై బ్లూ కలర్ గళ్ల లుంగీ ధరించి ఉన్నాడు. 40వ డివిజన్ 121 సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి నల్లూరి శాంతకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.
అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు


