రైతుల పేరుతో రూ.6 కోట్ల రుణం | - | Sakshi
Sakshi News home page

రైతుల పేరుతో రూ.6 కోట్ల రుణం

Mar 27 2025 1:45 AM | Updated on Mar 27 2025 1:45 AM

రైతుల

రైతుల పేరుతో రూ.6 కోట్ల రుణం

జగ్గయ్యపేట: ఆరుగాలం పండించిన మిర్చి పంటకు గిట్టుబాటు ధరలు లేక ఒక పక్క రైతులు ఆర్థిక నష్టాలతో అల్లాడుతున్నారు. గిట్టుబాట ధర వచ్చాకే విక్రయించాలన్న భావనతో అదనపు ఖర్చయినా భరించి పంటను నిల్వచేసేందుకు కోల్డ్‌ స్టోరీజీలను ఆశ్రయిస్తున్నారు. అయితే కోల్డ్‌ స్టోరేజీల యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం రైతులకు శాపంగా మారింది. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు పంటను కోల్పోయి, పరిహారం వచ్చే దారిలేక కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏడాదంతా కష్టపడి సాగు చేసి చివరకు అగ్ని ప్రమాదాలకు గురవటం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.

ఎన్టీఆర్‌ జిల్లాలో 11 కోల్డ్‌ స్టోరేజీలు

రైతులు పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ చేసేందుకు ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా 11 కోల్డ్‌ స్టోరేజీలు ఉన్నాయి. విజయవాడ రూరల్‌ మండలంలోని రామవరప్పాడు, గొల్లపూడి, సూరాయపాలెం, ఇబ్రహీంపట్నం మండ లంలోని కొండపల్లి, తుమ్మలపాలెం, నందిగామ మండలంలోని అంబారుపేట, నందిగామ, మునగచర్ల, అనాసాగరం, పెనుగంచిప్రోలు మండలంలోని తోటచర్ల, నవాబుపేట, జగ్గయ్యపేట, మండల కేంద్రమైన వత్సవాయిలో కోల్డ్‌ స్టోరేజీలు ఉన్నాయి. ఈ స్టోరేజీల్లో ఆయా ప్రాంతాలకు అనుగుణంగా మిర్చి, పసుపు, బెల్లం, చింతపండు, మినుము, పెసలు, కందులు, బెంగాలి శనగలు వంటి ఉత్పత్తులు రైతులు నిల్వ చేసుకుంటారు. ఒక్కొక్క కోల్డ్‌ స్టోరేజీలో నాలుగు నుంచి ఎనిమిది అంతస్తులు ఉంటాయి. వేల టన్నుల పంట ఉత్పత్తులను నిల్వ చేసే సామర్థ్యం ఈ కోల్డ్‌ స్టోరేజీలకు ఉంది.

స్టోరేజీల్లో కానరాని నిబంధనలు

కోల్డ్‌స్టోరేజీల్లో పంట ఉత్పత్తులను నిల్వ చేసేందుకు పలు శాఖల అధికారులు విధించే నిబంధనలను యాజమాన్యాలు విధిగా పాటించాలి. ఆ మేరకు చర్యలు తీసుకోవాలి. కానీ పలు స్టోరేజీల్లో నిబంధనలు పూర్తి స్థాయిలో పాటించటం లేదు. దీంతో రైతులు పండించిన పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కొందరు వ్యాపారులు లాభాలు వస్తాయని ఇష్టానుసారంగా గ్రూపులుగా ఏర్పడి కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణాలు చేపట్టటమే కాకుండా అద్దెకు తీసుకుంటున్నారు. అధికారులు నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా జిల్లాలోని కొన్ని కోల్డ్‌ స్టోరేజీలు నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా స్టోరేజీ నిర్మాణం చేయాలంటే సొంత స్థలం ఉండాలి. లేదా లీజుకు తీసుకుంటే దానికి సంబంధించిన లీజు డాక్యుమెంట్‌లు, మార్కెటింగ్‌ శాఖ ఇచ్చే లైసెన్స్‌, జీఎస్టీ నంబరు, ఫైర్‌ ఎన్‌ఓసీ వంటి అనుమతులు తప్పనిసరి. మార్కెటింగ్‌ శాఖ స్టోరేజీకి ఐదేళ్లకు ఒకసారి లైసెన్స్‌ ఇస్తుంది. ఆ గడువు దాటితే తప్పక రెన్యు వల్‌ చేయించాలి. ముఖ్యంగా స్టోరేజీల్లో పంట నిల్వల ప్రకారం యాజమాన్యం ఇన్సూరెన్స్‌ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని స్టోరేజీలు యాజమాన్యాలు ఇన్సూరెన్స్‌ చేయించడంలేదు. ఆయా స్టోరేజీల్లో ఏదైన ప్రమాదం జరిగితే పూర్తిగా నష్టపోయేది రైతులే. ఈ కోవలో ఈ నెల 25 అర్ధరాత్రి జగ్గయ్యపేట పట్టణ పరిధిలోని తొర్రకుంటపాలెంలో ఉన్న సాయితిరుమల అగ్రి ప్రొడక్ట్‌ లిమిటెడ్‌ కోల్డ్‌ స్టోరేజీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గత నెలలోనే ఈ కోల్డ్‌ స్టోరేజీ ఇన్సూరెన్స్‌ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ కోల్డ్‌ స్టోరేజీలో పంట నిల్వ చేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

తనిఖీలు హుష్‌కాకి

కోల్డ్‌స్టోరేజీల్లో ఏడాది పొడవునా మార్కెటింగ్‌, అగ్నిమాపక, విద్యుత్‌, రెవెన్యూ శాఖాధికారులు తనిఖీ చేయాల్సి ఉంది. అయితే ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవన్న ఆరోపణలు రైతుల నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా స్టోరేజీ లైసెన్స్‌లు, పంటల స్టాకు వివరాలతో పాటు ఇన్సూరెన్స్‌ వివరాలను తనిఖీ చేయాల్సి ఉంది. అయితే ఆయా శాఖల కింది స్థాయి అధికారులు కూడా తనిఖీ చేయలేని పరిస్థితి నెలకొంది.

రైతులతో యాజమాన్యాల చెలగాటం

పలు కోల్డ్‌ స్టోరేజీల యాజమాన్యాలు తమ అవసరాల కోసం రైతులతో చెలగాటమాడుతున్నాయి. స్టోరేజీల్లో పంట ఉత్పత్తుల పేరుతో వివిధ బ్యాంకుల్లో రూ.కోట్లలో రుణాలు తీసుకుంటున్నాయి. దీంతో రైతులు పడిన కష్టాన్ని కోల్డ్‌ స్టోరేజీల నిర్వాహకులు అనుభవిస్తున్నారు. 2015– 16లో జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామంలో శ్రీసాయి యోగానంద కోల్డ్‌ స్టోరేజ్‌ యాజమాన్యం రైతులు నిల్వ ఉంచిన దాన్యంపై బ్యాంకులో రుణం తీసుకుని చెల్లించలేదు. బ్యాంకు అధికారులు స్టోరేజీను వేలం వేయటంతో రైతులకు ఎటువంటి పరిహారం అందలేదు.

కోల్డ్‌స్టోరేజీల్లో కనిపించని భద్రతా ప్రమాణాలు ప్రమాదాలు జరుగుతున్నా మేల్కొనని యంత్రాంగం 11 కోల్డ్‌ స్టోరేజీల్లో వేల టన్నుల మిర్చిపంట నిల్వలు జగ్గయ్యపేట కోల్డ్‌స్టోరేజీకి ముగిసిన ఇన్సూరెన్స్‌ గడువు రెన్యువల్‌ చేయించడాన్ని విస్మరించిన యాజమాన్యం

లైసెన్స్‌ లేకుంటే చర్యలు

కోల్డ్‌ స్టోరేజీల్లో నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు. స్టోరేజ్‌ లైసెన్స్‌లు, ఇన్సూరెన్స్‌లకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నాం. జగ్గయ్యపేట సాయి తిరుమల కోల్డ్‌ స్టోరేజ్‌కు ఇన్సూరెన్స్‌ గడువు ముగిసిందని విచారణలో తేలింది. ఇప్పటికే రైతుల వివరాలు తెలుసుకుంటున్నాం. ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం.

– మంగమ్మ, మార్కెటింగ్‌ శాఖ ఏడీ

జగ్గయ్యపేటలోని సాయితిరుమల అగ్రిప్రొడక్ట్స్‌ యాజమాన్యం 19 మంది రైతుల పేరుతో రూ.6.60 కోట్ల బ్యాంకు రుణం తీసుకుంది. బ్యాంకు అధికారులు కోల్డ్‌ స్టోరేజీ ఇన్సూరెన్స్‌ గడువు ముగిసినప్పటికీ రుణం మంజూరు చేయటం పలు అనుమానాలకు తావిస్తోంది. బుధవారం పలు గ్రామాల రైతులు ఇన్సూరెన్స్‌ విషయమై కోల్డ్‌ స్టోరేజీ వద్ద ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వర్లు ఘటనాస్థలానికి చేరుకుని వారికి సర్దిచెప్పారు.

రైతుల పేరుతో రూ.6 కోట్ల రుణం1
1/2

రైతుల పేరుతో రూ.6 కోట్ల రుణం

రైతుల పేరుతో రూ.6 కోట్ల రుణం2
2/2

రైతుల పేరుతో రూ.6 కోట్ల రుణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement