గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణానదిలో పిండాల్ ఘాట్‌వద్ద బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుని వయసు 40 నుంచి 45 సంవత్సరాలు మధ్య ఉంటుంది. ఒంటిపై నలుపురంగు చారల డిజైన్ ఫుల్‌హ్యాండ్ షర్ట్, నలుపు రంగు బనియన్, లైట్ కాఫీ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహం నీటిలో తేలియాడుతూ ఉండడం గమనించిన స్థానికులు సచివాలయ ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీకి సమాచారం అందించారు. ఉమెన్ ప్రొటెక్షన్‌సెక్రటరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు గుర్తు తెలియని మగ వ్యక్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భవనం పైనుంచి జారి పడి యువకుడు మృతి
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): ప్రమాదవశాత్తు ఓ భవనం మూడవ అంతస్తు నుంచి జారి పడి యువకుడు మృతిచెందిన ఘటనపై ఎస్‌ఎన్‌పురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షేక్ మస్తాన్ నగరంలోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో కలసి కేదారేశ్వరపేట జీరో లైన్‌లో మూడంతస్తుల భవనంలో నివాసముంటున్నాడు. అతని కొడుకు షేక్ మంజీ గతంలో మెడికల్ ఫీల్డ్‌లో పనిచేసి ఆరోగ్య సమస్యలతో ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో వారు ఉంటున్న ఇంటి వరండాలో దుస్తులు ఆరేసేందుకు తాడు కట్టమని తల్లి చెప్పడంతో కొడుకు మంజీ సరే అని కట్టేందుకు వెళ్లగా అప్పటికే అక్కడ బట్టలు ఉతికిన సబ్బు నీరు ఉండటంతో కాలు జారి అదుపు తప్పి గోడ మీదుగా కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావటంతో కుటుంబ సభ్యులు నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై లోతైన దర్యాప్తు చేయాలి
పటమట(విజయవాడతూర్పు): దైవ సేవకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి పలు అనుమానాలకు తావిస్తోందని ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవీణ్ మృతదేహాన్ని చూసినప్పుడు ఎవరో చంపేసి అక్కడ పడవేసినట్లుగా ఉందని, దీనిపై పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా వారి నుంచి సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరించిన వ్యక్తికి తలకి గాయం కావడం ముఖం మీద ఎవరో కొట్టినట్లు ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. నెలరోజుల క్రితం స్వయంగా ప్రవీణ్ రిలీజ్ చేసిన ఒక వీడియోలో తనకు ప్రాణహాని ఉన్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి లోతైన విచారణ జరిపి నిజాలు బయటికి తీయవలసిందిగా బిషప్ కౌన్సిల్ తరఫున డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
తల్లిని చంపిన వ్యక్తికి జీవితఖైదు
తిరువూరు: డబ్బు కోసం తల్లిని చంపిన నిందితుడికి 15వ ఏడీజే కోర్టు జడ్జి జీవితఖైదు విధించినట్లు గంపలగూడెం ఎస్‌ఐ శ్రీను తెలిపారు. 2023లో గంపలగూడెం మండలంలోని చింతలనర్వకు చెందిన మరీదు వెంకటేశ్వరరావు డబ్బు కోసం తల్లి వెంకమ్మను వేధించి ఆమె నిరాకరించడంతో దాడిచేసి కొట్టి చంపాడు. నిందితుడిని అరెస్టు చేసిన గంపలగూడెం పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా విచారణ అనంతరం నిందితుడికి జీవిత ఖైదు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారని ఎస్‌ఐ పేర్కొన్నారు. నిందితుడు 2006లో తండ్రి జగ్గయ్యను కూడా హత్య చేసినట్లు తెలిపారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ అబ్దుల్ షరీఫ్ వాదించారు.