వైట్‌హౌజ్‌ ట్రక్కు దాడి ఘటన: సాయివర్షిత్‌పై తీవ్ర అభియోగాలు.. ఎలాంటి శిక్ష పడుతుందంటే..

U Haul Truck Crash: Serious Chagres Against Sai Varshith  - Sakshi

తాను హిట్లర్‌కు అభిమానినని, నాజీయిజం గొప్పదని చెబుతూ.. అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోవడమే లక్ష్యమని, అడ్డొస్తే ఏకంగా అధ్యక్షుడినైనా చంపుతానంటూ ప్రకటించి సంచలనానికి తెర తీశాడు తెలుగు మూలాలున్న సాయి వర్షిత్‌.  వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో సహా దూసుకెళ్లి బారికేడ్లను ఢీ కొట్టి హల్‌చల్‌ చేసిన ఆ టీనేజర్‌పై తీవ్ర అభియోగాలే నమోదు అయ్యాయి. 

తెలుగు మూలాలు ఉన్న 19 ఏళ్ల సాయివర్షిత్‌.. సోమవారం(మే22 రాత్రి సమయంలో) ఓ ట్రక్‌తో వైట్‌హౌజ్‌ వైపు దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టి కలకలమే రేపాడు. ఆపై అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే.. విస్తూపోయే విషయాలను వెల్లడించాడు. బుధవారం ఫెడరల్ కోర్టులో అతన్ని హాజరుపర్చగా.. మే 30 దాకా కస్టడీ విధించింది న్యాయస్థానం. 

‘‘ప్రెసిడెంట్‌తో పాటు వైస్‌ ప్రెసిడెంట్‌ను చంపుతానని బెదిరించడం, వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులకూ హాని తలపెడతానని ప్రకటించడం, అధ్యక్షుడి కిడ్నాప్‌నకు యత్నం, అధ్యక్షుడికి హాని తలపెట్టే యత్నం, మారణాయుధాలు కలిగి ఉండడం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, అక్రమ చొరబాటు, ప్రభుత్వ ఆస్తికి నష్టం కలగజేయడం.. లాంటి అభియోగాలను యూఎస్‌ పార్క్‌ పోలీసులు సాయి వర్షిత్‌పై నమోదు చేశారు. అంతేకాదు అతనసలు అమెరికా పౌరుడే కాదని ప్రాసిక్యూటర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అభియోగాల ఆధారంగా.. గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల(మన కరెన్సీ ప్రకారం) జరిమానా విధించే అవకాశం ఉందని  న్యాయమూర్తి రాబిన్ మెరివెదర్ సాయివర్షిత్‌కు స్పష్టం చేశారు. 

సోమవారం రాత్రి.. సెయింట్‌ లూయిస్‌ నుంచి వాషింగ్టన్‌కు సాయివర్షిత్‌ రాత్రి ఎనిమిది గంటలకు చేరుకున్నాడు. అక్కడ యూ హాల్‌ బాక్స్‌ ట్రక్‌ను అద్దెకు తీసుకున్నాడని, నేరుగా వైట్‌ హౌజ్‌ వైపు దూసుకెళ్లాడని కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో పోలీసులు వెల్లడించారు. వైట్‌ హౌజ్‌లోకి చొరబడి.. అధికార కైవసం చేసుకోవాలని అనుకున్నానని, దేశాన్ని పాలించడమే తన ఉద్దేశమని సాయివర్షిత్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. అదెలా సాధ్యమని పోలీసులు నిలదీయగా.. అధ్యక్షుడిని చంపడమో లేదంటే అడ్డొచ్చే వాళ్లను గాయపర్చడం ద్వారానో అనుకున్నది సాధించాలని సాయివర్షిత్‌ వెల్లడించినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లకు హాని తలపెట్టడమే తన ఉద్దేశమని స్పష్టం చేశాడు సాయివర్షిత్‌. ఈ మేరకు ఆరు నెలల నుంచే గ్రీన్‌ బుక్‌ పేరిట తాను  ఎలా ప్లాన్‌ చేసుకున్నదంతా సాయి రాసుకున్నట్లు తెలుస్తోంది. 

సాయివర్షిత్ మిసోరీ రాష్ట్రం చెస్టర్‌ఫీల్డ్‌లో ఉంటున్నాడు. అతని తల్లిదండ్రుల నేపథ్యం తెలియాల్సి ఉంది.  నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు అతడి ట్రక్‌లో జర్మనీ నియంత హిట్లర్‌కు చెందిన నాజీ పార్టీ జెండా కూడా కనిపించింది. బైడెన్‌ను చంపి అమెరికా పగ్గాలు చేపట్టడమే తన లక్ష్యమని సాయివర్షిత్ పోలీసులకు చెప్పాడు. గతంలో డేటా అనలిస్ట్‌గా పని చేశానని, ప్రస్తుతం తానొక నిరుద్యోగినని చెప్పాడు. బుధవారం కోర్టు విచారణలోనూ వినయంగా అతను సమాధానాలు ఇవ్వడంతో జడ్జి సైతం ఆశ్చర్యపోయారు. మరోవైపు అతని తల్లిదండ్రులు బెయిల్‌ కోసం యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.  

ఇదీ చదవండి: 14 దేశాలను టచ్‌ చేసే రోడ్డు ఇదే!

మరిన్ని వార్తలు :

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top