టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు

Texas Governor Declared Ugadi As Telugu Language Heritage Day - Sakshi

తెలుగు భాషా వారసత్వ దినంగా గుర్తింపు

ప్రత్యేక ప్రకటన జారీ చేసిన టెక్సాస్‌ గవర్నర్‌  

డల్లాస్‌ (టెక్సాస్): శ్రీ శుభ కృత్ నామ నూతన సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ 2022 ఏప్రిల్ 2వ  తేదీని తెలుగు భాషా వారసత్వ దినంగా ప్రకటించారు. ఈ మేరకు  ప్రముఖ ప్రవాస భారతీయ నాయకులు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్‌ ప్రసాద్ తోటకూర పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

టెక్సాస్ రాష్ట్రంలో వివిధ నగరాలలో నివశిస్తున్న లక్షలాది తెలుగు కుటుంబాల వారు విభిన్న సంస్కృతుల వారితో మమేకమవుతూ విద్య, వైద్య, వాణిజ్య, ప్రభుత్వ, కళా రంగాలలో తెలుగువారు పోషిస్తున్న పాత్ర మరువలేనిదని టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ అన్నారు. తెలుగు వారికున్న క్రమశిక్షణ, కుటుంబ విలువల పట్ల గౌరవం, వృత్తిపట్ల నిభద్దత, విద్య పట్ల శ్రద్ధ ఇతరులకు ఆదర్శప్రాయం అన్నారు. టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని వారు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఆ అధికారిక ప్రకటనలో పిలుపునిచ్చారు.

అనంతరం డాక్టర​ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ టెక్సాస్ రాష్ట్రంలో చిరకాలం గా నివశిస్తున్న తెలుగు వారి పట్ల టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక గౌరవం, శ్రద్ధ చూపుతున్నారని కొనియాడారు. ఉగాది పండుగ వేడుకల్లో గవర్నర్‌ సతీమని సిసీలియా కూడా మమేకమయ్యారని తెలిపారు. అంతేకాకుండా ఉగాది రోజుని   తెలుగు భాషా వారసత్వ దినంగా ప్రకటించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని వెల్లడించారు. 
 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top