మెతుకు సీమలో ప్రధాన పర్యాటకుల ఆకర్షణగా మెదక్ చర్చి

Special Story About Medak Church On Occasion Of Christmas - Sakshi

మెదక్ ఒకప్పటి మెతుకు సీమలో అడుగు పెట్టగానే అల్లంత దూరం నుంచి మనకు స్వాగతం చెప్పేది. అక్కడి కొండ పై నున్న కాకతీయుల కాలం నాటి మెదక్ కోట. అంతే ప్రాధాన్యత గలది, మెదక్ పట్టణానికే ఒక మైలురాయి లాంటిది, ఎంతో మంది పర్యాటకులను ఆకర్షించేది. ఆసియాలోనే అతిపెద్ద చర్చులలో ఒక్కటైనది 'మెదక్ చర్చి'. బ్రిటిష్ వారి పాలనా కాలంలో తిరుమలగిరి లోనున్న వారి సైనికుల కోసం 1895 లో వచ్చిన రెవరెండ్ చార్లెస్ పోస్నెట్ అనే క్రైస్తవ మత గురువు, హైదరాబాద్కు వంద కి.మీ దూరంలోనున్న మెతుకు సీమ కరువు కాటకాలతో అల్లాడుతుందని తెలుసుకొని అక్కడికి గుర్రం మీద ఒక రోజు ప్రయాణం చేసి వెళ్ళాడట.

కరువు పీడితులను ఆదుకోడానికి 'ఫ్రీ కిచెన్' అన్నదానాల కన్నా వారికి ఉపాధి నిచ్చే పని కల్పించడం ఉత్తమమని ఆలోచించాడు. అందుకోసం 1914 లో ఘుస్నాబాద్ ప్రాంతంలోని విశాల స్థలంలో ప్రస్తుత చర్చి నిర్మాణాన్ని ప్రారంభించగా అది పది సంవత్సరాలు కొనసాగిందట. దీని వాస్తు శిల్పి థామస్ ఎడ్వార్డ్ హార్దింగ్ క్యాతెడ్రాల్. ముప్పై మీటర్లు వెడల్పు, అరవై మీటర్లు పొడువు ఈ నిర్మాణం దాదాపు ఐదు వేల మందికి సరిపడే ప్రార్థనాలయం. దీనికి కావలసిన మొజాయక్ టైల్స్ను ఆ రోజుల్లోనే బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకున్నారట. వాటిని పరిచే ఇటాలియన్ మేస్త్రీలను బొంబాయి నుంచి పిలిపించారట.

బోలు స్పాంజ్తో పై కప్పువేసి సౌండ్ ప్రూఫ్గా మార్చారట. క్రీస్తు జీవితంలోని క్రీస్తు జననం, శిలువ వేయడం, ఆరోహణ వంటి విభిన్న దృశ్యాలున్న స్టాయిన్ గ్లాస్ కిటికీలు ఇందులో ప్రత్యేకమైనవి. ఈ చర్చి 'బెల్ టవర్' మరీ ప్రత్యేకమైంది. దీని ఎత్తు 53 మీటర్లు అంటే చార్మినార్ కన్నా కూడా ఎత్తయిందన్న మాట. హైదరాబాద్ నగరానికే మకుటాయమానమైన చార్మినార్ కన్నా కూడా మించిన ఎత్తులో ఈ బెల్ టవర్ను నిర్మించడం ఆనాటి నిజాంగారికి నచ్చలేదంటారు. ఏదేమైనా 1924 నాటికీ అన్ని హంగులతో సిద్దమైన ఈ చర్చి క్రైస్తవ భక్తులనే కాదు దేశ విదేశ పర్యాటకులను కూడా ఆకర్శించడం సంతోషకరం.

వేముల ప్రభాకర్, అమెరికా డల్లాస్

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top