అంతర్జాల సదస్సులో వక్తలు

Special Meeting Held On C Narayana Reddy 4th Death Anniversary - Sakshi

మహాకవి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి కవిత్వం అజరామరమైనదని వక్తలు శ్లాఘించారు. డా సినారె 4వ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ సారస్వత పరిషత్తు, వంశీ - డా సినారె విజ్ఞాన పీఠం, కేతవరపు పౌండేషన్, సంతోషం ఫిలిం న్యూస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జరిగిన అంతర్జాల సదస్సులో సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి  అధ్యక్షోపన్యాసం చేస్తూ.. డా సినారె పండితులలో పండితుడు, కవులకే కవి, పరిశోధకులకే పరిశోధకుడు అన్నారు.. సినారె శబ్ద పుష్టి, శబ్ద సిద్ధి అనితర సాధ్యమని తెలిపారు. తెలుగు సాహిత్యాన్ని బోధించడంలో ఆయన ఆదర్శప్రాయులని అన్నారు. సారస్వత పరిషత్తు అధ్యక్షునిగా పరిషత్తును పునరుజ్జీవింప చేశారు.

ప్రముఖ సినీ గీత కర్త భువనచంద్ర మాట్లాడుతూ సినారె అనే మహావృక్షం నీడలో వేలమంది విద్యార్థులు భాషా సాహిత్య విజ్ఞాన దాహార్తిని తీర్చుకుని సేదదీరారని అన్నారు. అటు సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అనితరసాధ్యమైన కృషితో అత్యున్నత స్థానం అందుకున్న సినారె తరాలకు తరగని స్ఫూర్తి ప్రదాత అని వివరించారు. అందమైన, అర్థవంతమైన తెలుగు పలుకులను ప్రయోగించే శక్తి సినారె స్వంతమని అన్నారు.

వంశీ రామరాజు స్వాగత ప్రసంగం చేస్తూ డా సి.నారాయణరెడ్డి  ప్రోత్సాహంతో 50 ఏళ్లుగా వంశీ గణనీయమైన రీతిలో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న దని, వేగేశ్న సేవా సంస్థ ద్వారా అనాధలను ఆదరించి, చదివించి ఉన్నత స్థానంలో నిలుపుతున్నామని తెలిపారు. కేతవరపు రాజ్యశ్రీ సినారె నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుని ఆచరణలో పెట్టామన్నారు.. సురేష్ కొండేటి "సంతోషం ఫిలిం న్యూస్" మాట్లాడుతూ పత్రికా రచయితగా సినారె  నుంచి ప్రోత్సాహం, స్ఫూర్తిని పొందామన్నారు. రసమయి స్థాపకులు డా ఎమ్ కె రాము "సినారె కవిత-- లయాత్మక"  అనే అంశం పైన, డా వి ఎల్ నరసింహారావు "సినారె సినీగీతాలు పైన" డా ఎం కె పద్మావతి దేవి "డా సినారె కవితా దర్శనం -  చారిత్రక కావ్యాలు- స్త్రీ పాత్ర చిత్రణ" పైన, డా సందినేని రవీందర్ "సినారె గేయనాటికల పైన" ప్రసంగించారు.. తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధానకార్యదర్శి డా జుర్రు చెన్నయ్య కార్యక్రమాన్ని నిర్వహించారు..

డాలస్(అమెరికా)లో ఉన్న ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ శ్రీనివాస రెడ్డి ఆళ్ళ, లండన్లో ఉన్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ సాహిత్య విభాగం అధ్యక్షురాలు సింగిరెడ్డి శారద కూడా తమ ప్రసంగాలలో డా సినారె సాహిత్య, సాంస్కృతిక విశిష్టతను ప్రస్తావించారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top