సౌదీ అరేబియాలో హౌతీల దాడులు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. రాజధాని రియాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అక్కడ నివసిస్తున్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని, అవసరమైనప్పుడు ఇళ్లలోనే ఉండాలని, స్థానిక అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరింది.
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన వీడియోలు, వార్తలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం, తిరిగి పోస్టు చేయడం మానుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు, సౌదీలో నెలకొన్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఎయిరిండియా, ఇండిగో, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. రియాద్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసులను అక్టోబర్ 10 వరకు రద్దు చేశాయి. ప్రభావితమైన ప్రయాణికులకు పూర్తి రీఫండ్ లేదంటే ప్రత్యామ్నాయ తేదీల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తామని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించింది.
రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ప్రయాణికులకు సూచనలు జారీ చేసింది. విమానాశ్రయానికి బయలుదేరే ముందు సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించి, తమ విమాన సర్వీసుల తాజా పరిస్థితిని తెలుసుకోవాలని కోరింది. గురువారం సౌదీ రాజధాని రియాద్ మీదుగా పలు పేలుళ్ల శబ్దాలు వినిపించిన నేపథ్యంలో ఈ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆ సేవలు యథాతథం
సౌదీలోని భారతీయులకు అవసరమైన సహాయం అందించేందుకు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని భారత కాన్సులేట్ సాధారణంగానే పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. వీఎఫ్‌ఎస్ ద్వారా అందించే సేవలు కూడా కొనసాగుతున్నాయని వెల్లడించారు. పరిస్థితులకు అనుగుణంగా అవసరమైనప్పుడు కొత్త సూచనలు జారీ చేస్తామని పేర్కొన్నారు.
భారతీయుల కోసం 24 గంటలూ అందుబాటులో ఉండే ప్రవాసీ భారతీయ సహాయ కేంద్రం (PBSK) టోల్‌ఫ్రీ నంబర్ 8002471234 ద్వారా సంప్రదించవచ్చని రాయబార కార్యాలయం తెలిపింది.
అమెరికాకు మద్దతుపై హౌతీల గురి?
ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఇటీవలి రోజుల్లో సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలు, సైనిక స్థావరాలు, చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాకు సౌదీ మద్దతు ఇస్తుండటమే ఈ దాడులకు కారణమని వారు పేర్కొంటున్నారు. సౌదీ గగనతలం తమ సైనిక కార్యకలాపాలకు వేదికగా మారుతోందని ఆరోపిస్తూ.. అక్కడి గగనతలంలో కార్యకలాపాలు నిర్వహించే అంతర్జాతీయ విమానయాన సంస్థలకు గురువారం మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.
బుధవారం రియాద్, అభా విమానాశ్రయాలపై జరిగినట్లు హౌతీలు ప్రకటించిన దాడుల్లో ముగ్గురు మరణించినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. హౌతీలపై సౌదీ అరేబియా, దానికి మద్దతుగా ఉన్న యెమెన్ బలగాలు పెద్ద ఎత్తున భూతల, వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత ఈ మరణాలు సంభవించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో సౌదీలో నివసిస్తున్న భారతీయులు అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, భద్రతా సూచనలను నిర్లక్ష్యం చేయవద్దని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: గ్రీన్‌కార్డ్ ఆశలకు షాక్


