
విదేశాల్లో ఫీజు భరించలేకపోతున్న తల్లిదండ్రులు
ప్రస్తుత ప్రభుత్వమైనా స్పందించాలని వేడుకోలు
సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు విదేశీ విద్య ఆశలు కల్పించారు.. కానీ ఏళ్ల తరబడి ఫీజులు విడుదల చేయకపోవడంతో విదేశాల్లో ఫీజు, ఇతర ఖర్చులు భరించలేక తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. 2022లో అప్పటి సోషల్ వెల్ఫేర్ జాయింట్ సెక్రటరీ రోనాల్డ్‌రోస్ గురుకులాల విద్యార్థులకు అత్యున్నత విద్యనందించేలా శాట్ క్యాంప్ ద్వారా శిక్షణ ఇప్పించారు.
అదే ఏడాది ఇంటర్ విద్యార్థులకు శాట్ పరీక్ష నిర్వహిస్తే 20 మంది విద్యార్థులు (Students) హాజరయ్యారు. ఇందులో ఐదుగురు విద్యార్థులు అమెరికాలోని కుడ్జ్‌టౌన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివేందుకు ఎంపికయ్యారు. ఈ మేరకు 2023 ఆగస్టులో ఇంజనీరింగ్ సీఎస్‌సీ బ్రాంచ్‌లో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కొక్కెరగడ్డ అనూహ్య శాంతిశ్రీరాజ్, హైదరాబాద్‌కు చెందిన పి.సృజనసింహ, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జి.అక్షయ చేరారు.
రెండేళ్లయినా..
విదేశీ విద్యపై ఆశతో అమెరికా వెళ్లి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈ ముగ్గురికీ ఫీజు చెల్లించలేదు. ఏటా 6 వేల డాలర్ల చొప్పున రెండేళ్లకు ఒక్కొక్కరికి 12 వేల డాలర్లను రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్‌గా మంజూరు చేయాల్సి ఉంది. ఏటా ఆరు వేల డాలర్ల స్కాలర్‌షిప్ ఇస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పడంతో.. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో విమాన టికెట్లు, ఫీజులకు అప్పులు చేసి పంపించారు. ఇప్పటికి ఒక్కొక్క విద్యార్థిపై సుమారు రూ.46 లక్షలు వెచ్చించినా.. ప్రభుత్వం నుంచి విడుదల కాక అప్పులు ఎలా తీర్చాలా? అని ఆందోళన చెందుతున్నారు.
అధికారుల చుట్టూ తిరుగుతూ..
విదేశీ విద్య స్కాలర్‌షిప్‌లు (Overseas Education Scholarship) అందించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు రెండేళ్ల నుంచి ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, సచివాలయంలో ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంతకంటే ముందు బ్యాచ్‌కు స్కాలర్‌షిప్ ఇవ్వడంతో.. ఆ ఆశతోనే విదేశీ విద్య వైపు మొగ్గు చూపామని చెబుతున్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో.. చదువు మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి వస్తుందని వాపోతున్నారు.
సీఎం జోక్యం చేసుకుంటేనే..
విదేశీ విద్య స్కాలర్‌షిప్‌కు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) జోక్యం చేసుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం చొరవ చూపి ఎస్సీ విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయకుండా చూడాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందించినందున తమ సమస్యలు పరిష్కరించాలని అభ్యర్థిస్తున్నారు.
చదవండి: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. కటాఫ్ తగ్గింది.. పోటీ పెరిగింది

