అమరగాయకునికి అద్భుత నివాళి.. 365 రోజుల పాటు ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’

Ghantasala Swara Raga Mahayagam Held For 365 Days Nri News Telugu - Sakshi

పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి సంవత్సర ప్రారంభం సందర్భంగా శనివారం(డిసెంబర్‌ 5) సాయంత్రం వారి జయంతిని పురస్కరించుకుని అమెరికా నుంచి ‘వంగూరి ఫౌండేషన్’, సింగపూర్ నుంచి ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’, భారత్ నుంచి ‘ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్’, ‘వంశీ ఇంటర్నేషనల్’, ‘శుభోదయం’ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 365 రోజుల పాటు జరగనున్న ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’ కార్యక్రమాన్ని, అంతర్జాల వేదికపై ఘనంగా ప్రారంభించారు.

ఈ ప్రారంభ మహోత్సవానికి ఘంటసాల సతీమణి సావిత్రమ్మ శుభాశీస్సులు అందించగా, వారి కుమార్తెలు సుగుణ, శాంతి జ్యోతి ప్రకాశనం గావించి, ప్రార్థనాగీతం ఆలపించి శుభారంభాన్ని పలికారు. ప్రముఖ సినీ కవి భువనచంద్ర, ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు వంగూరి చిట్టెన్ రాజు, జగన్మోహనరావు, తదితర ప్రముఖులు, ఇతర నిర్వాహక బృంద సభ్యులు పాల్గొని ఘంటసాల ఔన్నత్యంపై ప్రసంగించారు. అత్యధిక కాలం నిరంతరాయంగా ఘంటసాల స్మరణలో జరిగే కార్యక్రమంగా ఈ కార్యక్రమం అంతర్జాతీయ రికార్డు సృష్టిస్తోందని అందరూ అభినందనలు వ్యక్తం చేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మొదలైన సంస్థలలో ఈ కార్యక్రమం రికార్డును నమోదు చేసుకోబోతోందని నిర్వాహకులు తెలిపారు.
చదవండి: డల్లాస్ - తానా ఆద్వర్యంలో ఘనంగా పుస్తక మహోద్యమం!

ఘంటసాల ట్రస్ట్ , వంశీ అధ్యక్షుడు డాక్టర్ వంశీ రామరాజు మాట్లాడుతూ... డిసెంబర్ 4వ తేదీ 2022 వరకు సంవత్సరకాలం పాటు ప్రతిరోజూ గంటసేపు ఈ కార్యక్రమం కొనసాగిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గాయనీగాయకులు ఘంటసాల పాటలను ఆలపిస్తారని, కవులు రచయితలు వక్తలు ఘంటసాల వారిపై వ్యాసాలను కవితలను వినిపిస్తారని’ ప్రకటించారు.ఎంతోమంది గాయనీ గాయకులకు అన్నం పెట్టిన ఘంటసాల పాటకు సమున్నతస్థానం కల్పిస్తూ కల్పించే ఉద్దేశంతో హైదరాబాద్‌లో తాము నిర్మించిన ‘ఘంటసాల స్మృతి మందిరం’ గురించిన వివరాలను తెలియజేసి అక్కడ జరిగిన పూజా కార్యక్రమం విశేషాలను వీడియో రూపంలో అందరికీ చూపించారు.

ఈ కార్యక్రమం ప్రధాన సమన్వయకర్త  రాధిక మంగిపూడి వ్యాఖ్యాన నిర్వహణలో మూడు గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు చంద్రతేజ, ఆర్ఎస్ఎస్ ప్రసాద్, తాతా బాలకామేశ్వరరావు, కె విద్యాసాగర్ చక్కటి గీతాలను పద్యాలను ఆలపించి ప్రేక్షకులను మెప్పించారు. సింగపూర్ నుంచి గుంటూరు వెంకటేష్ ఈలపై, 20 కు పైగా ఘంటసాల పాటల పల్లవుల పల్లకిని పలికించి అందరినీ ఆకట్టుకున్నారు. జీవి రామకృష్ణ సౌజన్యంతో చౌటపల్లి, టేకుపల్లి, ఘంటసాల గ్రామాల నుంచి అలాగే విజయనగరం సంగీత కళాశాల నుంచి ప్రత్యేకంగా వీడియోలను రూపొందించి ఈ కార్యక్రమంలో ప్రేక్షకులకు ఘంటసాల నడయాడిన ప్రాంతాలను చూపించారు.

‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ..ఇంతటి బృహత్కార్యంలో తమ సంస్థ సహ నిర్వాహకులుగా పాలుపంచుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ముగింపు ఉత్సవంగా ‘ఘంటసాల శతజయంతి ఆరాధనోత్సవం’ 2022 డిసెంబర్ 4వ తేదీన సింగపూర్ లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ కార్యక్రమానికి అందరిని సింగపూర్ కు రావలసిందిగా కోరుతూ ఆహ్వానం పలికారు. ఘంటసాల వారితో పాటుగా ఇటీవల స్వర్గస్తులైన అతడి కుమారులు ఘంటసాల రత్న కుమార్‌ను కూడా స్మరిస్తూ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో నివాళులు అర్పించారు. వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధ, మేనేజింగ్ ట్రస్టీ సుంకరపల్లి శైలజ కార్యక్రమానికి అభినందనలు తెలియజేశారు.

భారత కాలమానం ప్రకారం...ప్రతి శని, ఆదివారాలలో ఉదయం 10 గంటలకు, ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు సంవత్సరకాలం పాటు కొనసాగే ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’ కార్యక్రమాన్ని ‘వంశీ ఆర్ట్ థియేటర్స్’, ‘శుభోదయం మీడియా’ యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చునని నిర్వాహకులు వెల్లడించారు.

చదవండి: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌..! భారత్‌కు వస్తోన్న ఎన్నారైలకు తప్పని తిప్పలు..!

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top