
న్యూశాయంపేట: వరంగల్‌లోని కరీమాబాద్‌కు చెందిన కడారి అఖిల్(26) మృతదేహం గురువారం ఉదయం కరీమాబాద్ నగరానికి చేరుకుంది. అఖిల్ జర్మనీలోనిలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. గత నెల 8న స్నేహితులతో కలిసి అక్కడి నదికి ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. ఆ తర్వాత వారానికి అఖిల్ మృతదేహం లభ్యమైంది.
భారత ఎంబసీ అధికారులు కుటుంబీకులకు సమాచారమిచ్చి మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం అఖిల్ మృతదేహం హైదరాబాద్ ఏయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. కుటుంబ సభ్యులు అక్కడి నుంచి మృతదేహాన్ని వరంగల్ తీసుకొచ్చారు. విగతజీవిగా మారిన అఖిల్‌ను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బొమ్మల అంబేడ్కర్ నివాళులర్పించారు. ఆయన వెంట కడారి కుమార్, నీలం మల్లేశం, శంకర్, భిక్షపతి, రాంప్రసాద్, అశోక్, సాంబయ్య, కుమారస్వామి, సురేశ్ తదితరులు ఉన్నారు.