ఇందూరే నా ధైర్యం.. | - | Sakshi
Sakshi News home page

ఇందూరే నా ధైర్యం..

Sep 1 2026 1:49 AM | Updated on Sep 1 2026 1:49 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌/నిజామాబాద్‌ అర్బన్‌: ప్రజా సమస్యలపై పోరాడుతూనే పార్టీ నిర్మాణం చేపడతానని, పార్టీ పెట్టిన నాలుగు నెలల తరువాత సొంత గడ్డకు రావడం ఎంతో సంతోషంగా ఉందని కల్వకుంట్ల కవిత అన్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అవినీతిపై పోరాటం చేస్తామన్నారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మనకు కావాల్సింది బంగారు తెలంగాణ కాదని.. బహుజన తెలంగాణ అని అన్నారు. పదవుల కోసం కాకుండా ప్రజల కోసమే పార్టీని స్థాపించానని స్పష్టం చేశారు. తాను ఏం తప్పు చేశానని తీహార్‌ జైలులో పెట్టారని, తనను అన్యాయంగా జైలులో పెట్టారని కవిత కన్నీరు పెట్టుకున్నారు. కన్నీరు పెట్టినంత మాత్రాన తాను పిరికిదాన్ని కాదని, సమస్యలపై పోరాటం చేస్తానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యిరోజులు అవుతున్నా ఒక్క హామీ అమలు చేయలేదని, రైతు భరోసా, రైతులు ఆగమయ్యారన్నారు. బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీని కేటీఆర్‌ స్నేహితుడు కోరుట్ల ఎమ్మెల్యే కోసమే తెరిపించలేదన్నారు. ఆయనకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరిగాయని కవిత ఆరోపించారు. నిజాం షుగర్స్‌ను తిరిగి తెరిపించే వరకు రైతుల మద్దతుగా ఉంటానన్నారు. సారంగపూర్‌ షుగర్‌ ఫ్యాక్టరీ కోసం ధర్నా చేస్తున్న కార్మికులకు మద్దతిస్తున్నామని, అవసరమైతే పోరాటం చేస్తామన్నారు.

ప్రశాంత్‌రెడ్డిని క్షమించేది లేదు..

కేసీఆర్‌ మాదిరిగా ఉండేందుకు ప్రశాంత్‌రెడ్డి ప్రయత్నిస్తాడని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే కుదురుతుందా అని విమర్శించారు. తండ్రీ కూతురిని విడదీయంలో ప్రశాంత్‌రెడ్డిది మొదటి పాత్ర అని.. ఆయనను క్షమించే ప్రసక్తేలేదని కవిత అన్నారు. తన ఉసురు ప్రశాంత్‌రెడ్డికి తగులుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ ఓడిపోయిన రెండో రోజే కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. బాజిరెడ్డి గోవర్ధన్‌, జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డిని తాను గెలిపిస్తే వారు నన్ను ఓడించారన్నారు. ప్రశాంత్‌ రెడ్డి, జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదన్నారు. ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, ధన్‌పాల్‌, ప్రశాంత్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డిల అక్రమాలపై పోరాడతామన్నారు.

అర్వింద్‌వి అడ్డగోలు మాటలు..

ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పేరులోనే ధర్మం ఉందని, కానీ ఆయనలో మొత్తం అధర్మమేనని కవిత విమర్శించారు. మాధవ్‌ నగర్‌ బ్రిడ్జిని ఏడేళ్లుగా ఎందుకు కట్టించలేకపోతున్నారని ప్రశ్నించారు. ఆయన తెచ్చానని చెప్పుకుంటున్న పసుపు బోర్డు ద్వారా రైతులకు పైసా ప్రయోజనం లేదని, ప్రశ్నిస్తే అడ్డగోలుగా మాట్లాడటం తప్పా ఆయన ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అర్వింద్‌, ప్రశాంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి పోదామని అనుకుంటున్నారంట? అర్వింద్‌ కేసీ వేణుగోపాల్‌ను కూడా కలిశాడంట.. అని కవిత అన్నారు. ప్రజల కోసం పార్టీలు మారితే ఓకే కానీ పదవుల కోసం మారేవాళ్లను సహిద్దామా? అంటు సభకు హాజరైన వారిని ప్రశ్నించారు.

ప్రజల కోసమే.. పాంచజన్యం

మీపై ఆశతోనే ముందుకు వెళ్తున్నా

ఇక్కడి నుంచి పుట్టిన

రాజకీయ పార్టీ చరిత్రలో నిలవాలి

ఎప్పటిలాగే ఇకముందు కూడా

అండగా ఉండాలి

బంగారు తెలంగాణ కాదు..

బహుజన తెలంగాణ కావాలి

నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ కోసం

పోరాటం ఆపను

‘పాంచజన్య సంకల్ప సభ’లో టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

శ్రీకృష్ణుడిని, ఆయన చేతిలోని పాంచజన్యాన్ని నమ్ముకున్న వాళ్లు ఓడిపోయినట్లు చరిత్రలో లేదని కవిత అన్నారు. పాంచజన్యం పేరునే టీఆర్‌ఎస్‌ ఐదు అంశాలకు పెట్టామన్నారు. ఉచిత విద్య, వైద్యం, యువతకు ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం ఐదు అంశాలను సంకల్పంగా తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉపాధి రుణాలు, భూమిలేని పేదలకు భూలక్ష్మి పేరుతో ఎకరం భూమి అందిస్తామన్నారు. ప్రజల జీవితాల్లో గుణ్మాతక మార్పు తీసుకరావాలన్న సంకల్పంతో ముందుకు వచ్చానన్నారు. సభలో టీఆర్‌ఎస్‌ నాయకులు నవీన్‌ ఆచారి, అవంతిరావు, లక్ష్మీనారాయణ భరద్వాజ్‌, విజయలక్ష్మి, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement