8వ తేదీ నాటికి పట్టణ ప్రాంతాల్లో ‘సర్’ ఇలా..
మా ఓటు ఊళ్లోనే ఉండనివ్వండి..
● నివాసం పట్టణాల్లో..
ఓటు మాత్రం గ్రామంలో..
● పట్టణాల్లో ఎన్యుమరేషన్ ఫామ్
సమర్పించేందుకు ససేమిరా
ఖలీల్‌వాడి : ‘మా ఓటును ఊళ్లోనే ఉంచుకుంటాం.. ఇక్కడ అక్కర్లేదు..’ అంటూ జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో స్థిరపడిన వారు బీఎల్‌వోలకు స్పష్టం చేస్తున్నారు. ఊరితోపాటు పట్టణ ప్రాంతంలో ఓటు కలిగి ఉన్న వారు ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కారణంగా ఏదో ఒక చోట మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాల్సి రావడంతో చాలా మంది ఊరినే ఎంచుకుంటున్నారు. గ్రామాల్లో ఓటు ఉంటేనే తమకు అక్కడ విలువ ఉంటుందని, సంక్షేమ పథకాలు త్వరగా వర్తిస్తాయని.. పట్టణ ప్రాంతంలో ఎవరూ పట్టించుకోరని అంటున్నారు. పట్టణ ప్రాంతాల్లోని శివారు కాలనీల వాసులు సర్ ఫామ్‌లను ఊళ్లలోనే నింపేందుకు వెళ్తున్నారు. పిల్లల చదువులు, ఉద్యోగం, వ్యాపా రం తదితర కారణాలతో గ్రామీణులు జిల్లాలోని నిజామాబాద్ నగరంతోపాటు ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో నివాసం ఉంటున్నారు. పట్టణాల్లో ఇల్లు, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు ఉన్నా ఓటు మాత్రం గ్రామంలోనే ఉంచుకునేందుకు సిద్ధమవుతున్నారు.
పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో కనీసం ఓటు వేయమని అడిగే వారుండరని, ఊళ్లో ఎలక్షన్ వస్తే తమను వెతుక్కుంటూ వస్తారని, అక్కడే ఎక్కువ విలువ ఉంటుందని గ్రామీణప్రాంతానికి చెందిన వారు అంటున్నారు. ఎన్నికల సమయంలో ఓటు కోసం ఊరికి చెందిన లీడర్లు ఫోన్ చేస్తారని, బంధువులతో సమాచారం అందిస్తారని, అవసరమైతే వచ్చి కలిసి ఓటు వేయాలని కోరుతారని పేర్కొంటున్నారు. పట్టణంలో అన్నీ ఉన్నా ఓటు మాత్రం ఊళ్లోనే ఉండాలని స్పష్టం చేస్తున్నారు.
పట్టణ ప్రాంతాల్లో ఓటు ఎప్పుడు ఉంటుందో..? ఎప్పుడు ఉండదో తెలియని అయోమయం ఉంటుందని, ఒక్కసారి ఓటరు లిస్ట్‌లో ఉండటం మ రోసారి లేకపోవడంతో తాము గందరగోళానికి గురవుతామని గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు వా రంటున్నారు. ఓటు ఊరిలో ఓటు ఉంటే పదిలంగా ఉంటుందని, తీసివేసే పరిస్థితి వస్తే ఇంటి చుట్టూపక్కల వాళ్లు లేదా బంధువులు, కుల సంఘాల పెద్ద లు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకు లు ఒప్పుకోరని, తమకు వెంటనే సమాచారం అందిస్తారని నమ్మకంతో చెబుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజాప్రతినిధులు, నాయకులే ఇప్పిస్తారని, పట్టణాల్లో అయితే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా తాము పట్టణప్రాంతంలో నివాసం ఉంటున్నా ఓటు మాత్రం పల్లెలోనే ఉండాలంటున్నారు.


