రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్‌ అప్పులపాల్జేసింది | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్‌ అప్పులపాల్జేసింది

Jul 10 2026 9:51 AM | Updated on Jul 10 2026 9:51 AM

సుభాష్‌నగర్‌ : సర్‌ప్లస్‌లో ఉన్న రాష్ట్రాన్ని పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల అప్పుల పాల్జేసిందని ఎంపీ అర్వింద్‌ ధర్మపురి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు చోటుచేసుకున్నాయని రెండేళ్లు కాలయాపన చేసి, చివరకు సీబీఐకి అప్పగించి చేతులు దులుపుకున్నారని, మాజీ సీఎం కేసీఆర్‌ దొంగ అయితే.. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి గజదొంగ అని అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణతో కలిసి ఎంపీ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం అప్పుల పాలైందని తెలిసినా.. ప్రజలకు అబద్దాలు చెప్పి ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కాళేశ్వరంపై ఇద్దరూ డ్రామాలు ఆడుతున్నారన్నారు. రాహుల్‌గాంధీ రేవంత్‌రెడ్డిని సీఎంగా కొనసాగిస్తే కాంగ్రెస్‌ను నట్టేట ముంచడం ఖాయమని విమర్శించారు. మాధవనగర్‌ ఆర్‌వోబీకి నిధులు కేటాయించకపోవడంపై ప్రభుత్వానికి సిగ్గుండాలని, ఈవిషయమై బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు మీద కల్వకుంట్ల కవిత చేసిన అవినీతి, క్విడ్‌ ప్రోకో తదితర ఆరోపణలు తీవ్రమైనవని, రాష్ట్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్‌చేశారు.

సర్‌ ప్రక్రియ పూర్తయిన తరువాత కేవలం భారతీయులే మిగులుతారని, రోహింగ్యాలు ఇక్కడ ఉంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజలందరూ ఎస్‌ఐఆర్‌లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ పటేల్‌ కులాచారి, రాష్ట్ర, జిల్లా నాయకులు వడ్డి మోహన్‌రెడ్డి, గద్దె భూమన్న, ప్రమోద్‌కుమార్‌, న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ఓం సింగ్‌, శంకర్‌రెడ్డి, వెల్మ గంగారెడ్డి, విజయ్‌కృష్ణ, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

కవిత చేసిన ఆరోపణలపై సీబీఐ

దర్యాప్తునకు ఆదేశించాలి

రేవంత్‌ కాంగ్రెస్‌ను

నట్టేట ముంచుడు ఖాయం

మీడియాతో ఎంపీ అర్వింద్‌ ధర్మపురి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement