● రైతులు బీఆర్‌ఎస్ నాయకుల
మాయమాటల్లో పడొద్దు
● రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాజకీయ లబ్ధి కోసం బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే మోర్తాడ్‌లో రైతు ధర్నా పేరుతో కార్యక్రమం నిర్వహించారని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మిల్లర్ల దోపిడీ పెరిగిందంటున్న ప్రశాంత్‌రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో, తాము అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల కాలంలో మిల్లర్ల దోపిడీపై చర్చకు సిద్ధ మా అని సవాల్ చేశారు. ధాన్యం కొనుగోళ్లపై గత రెండు వారాలుగా సుదర్శన్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, భూపతిరెడ్డి నిరంతరం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారన్నారు. అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో, వ్యవసాయ శాఖ సెక్రెటరీతో, పౌరసరఫరాల శాఖ అధికారుల తో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ వస్తున్నారన్నారు. ధాన్యం సేకరణ విషయంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా తాము చేస్తున్న ప్రయత్నాలు ప్రశాంత్‌రెడ్డికి తెలియకపోవడం దురదృష్టమని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు మాత్రం కొవిడ్ విపత్తు సమ యంలో మిల్లర్లను దోచుకున్నారని ఆరోపించారు. పేరు గొప్ప కోసం మిల్లర్ల వద్ద బియ్యం తీసుకుని మోసం చేసిన ఘనత బీఆర్‌ఎస్ నాయకులదేనన్నారు. చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.


